PONGAL: అంబరాన్ని అంటుతున్న సంక్రాంతి సంబరాలు

PONGAL: అంబరాన్ని అంటుతున్న సంక్రాంతి సంబరాలు
పండుగ శోభతో కళకళలాడుతున్న తెలుగు లోగిళ్లు..... సంక్రాంతికి ప్రజల స్వాగతం

రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పండుగ శోభతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. ఏడాదంతా ఆనందోత్సాహాలు, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ భోగి మంటలతో సరదాల సంక్రాంతికి ప్రజలు స్వాగతం పలికారు. భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, రంగవల్లులు, కోడి పందాలతో ఊరూవాడా సందడిగా మారాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. అనంతపురం జిల్లా పరేడ్‌ గ్రౌండ్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పోలీసు అధికారులంతా సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు. కళాకారులతో కలిసి డీఐజీ అమ్మిరెడ్డి చిందేసి అలరించారు. ప్రజలంతా సాంప్రదాయ ఆటపాటలతో ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.


శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ పార్వతీ సమేత మల్లికార్జునస్వామి రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కళాకారులు, భక్తజన సందోహం మధ్య శ్రీగిరి పురవీధుల్లో రావణ వాహన సేవ కన్నుల పండుగ జరిగింది. కర్నూలులోని వెంకటరమణ కాలనీలో వాసవి సేవాదళ్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. చిన్నారులకు ఆర్యవైశ్యుల పెద్దలు భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. యువత సినీగీతాలకు డాన్సులు చేసి అలరించారు.

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో చంద్రన్న సంక్రాతి సంబరాలు సందడిగా జరిగాయి. చీమకుర్తిలో పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించారు. వివిధ జిల్లాలకు చెందిన మహిళలతో కబడ్డీ పోటీలు నిర్వహించారు. విజేతలకు నగదు బహుమతి అందజేశారు. పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు ప్రదానం చేశారు. గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్వంలో నందమూరి తారకరామారావు మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు నగరవాసుల్ని అలరించాయి. చిన్నారుల కూచిపూడి, భరత నాట్యం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జబర్దస్త్‌ బృందం ఆటపాటలతో నవ్విస్తూ సందడి చేసింది. విశాఖలోని ఆంధ్ర వర్శిటీ మైదానంలో నిర్వహించిన మహాసంక్రాంతి సంబరాల్లో కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాలా పాల్గొన్నారు. చిన్న పిల్లలకి భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. మహిళలతో కలిసి కోలాటం ఆడారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శ్రీ దుర్గామల్లేశ్వరి ట్రస్ట్ అధినేత విజయనగరం జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ముల్లు రమణ.. పేదలకు వస్ర్తధాన కార్యక్రమం నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story