జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కోవిడ్‌ నిబంధనలు తప్పని సరి చేసిన ఈసీ

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కోవిడ్‌ నిబంధనలు తప్పని సరి చేసిన ఈసీ

గ్రేటర్‌ ఎన్నికల వేళ కోవిడ్‌ వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలంటే మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని సూచించింది. లేకుంటే పోలింగ్‌ స్టేషన్‌లోకే అసలు అనుమతించరని వెల్లడించింది. అయితే ఓటరును గుర్తించేందుకు వీలుగా ఒకసారి మాస్కును తొలగించి తిరిగి వెంటనే పెట్టుకోవచ్చు. పోలింగ్‌ బూత్‌లోకి కూడా ఒక్కొక్కరుగానే వెళ్లాల్సి ఉంటుంది. ఓటు వేసేందుకు నిలబడే వరుసలోనూ ఒక్కో వ్యక్తికి మధ్య 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి. ఎన్నికల సమయంలో కరోనా కట్టడికి అనుసరించాల్సిన మార్గదర్శకాలను వైద్యఆరోగ్యశాఖ ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. ఆరోగ్యశాఖ సూచనలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బంది తమ కార్యక్రమాలను విశాలమైన హాళ్లల్లో నిర్వహించుకోవాలని.. ఈసీ సూచించింది. రిటర్నింగ్‌ అధికారి ఛాంబర్‌లో భౌతిక దూరం అనుసరించి నామినేషన్‌ దాఖలు, పరిశీలన, చిహ్నాల కేటాయింపు వంటి విధులను నిర్వహించాలని.. అందుకు అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవాలని తెలిపింది. పోలింగ్‌ జరిగే ప్రాంగణాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని.. పోలింగ్‌ సిబ్బంది ప్రయాణాల్లో కిక్కిరిసి వెళ్లొద్దని.. అందుకు తగ్గట్లుగా వాహనాలు సమకూర్చుకోవాలని వెల్లడించింది. ఎన్నికల సిబ్బంది ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని.. పోలింగ్‌ సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే తక్షణమే వారి స్థానంలో మరొకరిని నియమించేందుకు వీలుగా రిజర్వుడు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేసింది.

ఎన్నికల సామాగ్రి పంపిణీ, సేకరణ, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో శానిటైజర్లను ఏర్పాటు చేయాలని.. కోవిడ్‌ జాగ్రత్తలపై అవగాహన పెంపొందించే కరపత్రాలను అందుబాటులోకి తేవాలని తెలిపింది. పోలింగ్‌ అధికారులకు, భద్రతా సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్లు, ఫేస్‌ షీల్డ్‌లు తప్పనిసరి చేసింది. రోడ్డు ప్రదర్శనల్లో భద్రతా వాహనాలను మినహాయిస్తే.. మిగిలిన వాహనాల మధ్య 100 మీటర్ల దూరం ఉండాలని.. ఒకే మార్గంలో రెండు వేర్వేరు రాజకీయ పార్టీ అభ్యర్థుల రోడ్‌షోల మధ్య కనీసం అరగంట వ్యత్యాసం ఉండాలని సూచించింది. కోవిడ్‌ ప్రోటోకాల్‌ ప్రకారమే సభలు, సమావేశాలు నిర్వహించాలని తెలిపింది. ఇంటింటి ప్రచారానికి ఐదుగురికే అనుమతిచ్చింది. చివరిగా.. బ్యాలెట్‌ పెట్టెలను లెక్కించే ముందు శుభ్రపరచాలని మార్గదర్శకల్లో పేర్కొంది ఈసీ.

Tags

Read MoreRead Less
Next Story