Anganwadi: కదం తొక్కుతున్న అంగన్‌వాడీలు

Anganwadi: కదం తొక్కుతున్న  అంగన్‌వాడీలు
8వ రోజుకు అంగన్వాడీల సమ్మె

డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనలు ఏడో రోజూ కొనసాగాయి. న్యాయంగా పోరాటం చేస్తున్న తమను వైకాపా ప్రభుత్వం అణచివేసేందుకు యత్నిస్తోందని కార్యకర్తలు ఆవేదన చెందారు. ఒకవైపు తమతో చర్చలు జరుపుతూనే మరోవైపు అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకుంటున్నారని మండిపడ్డారు.

గుంటూరు కలెక్టరేట్‌ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నోట్లో ఆకులు పెట్టుకుని నిరసన తెలిపారు. ప్రతిపక్ష హోదాలో జగన్‌ ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని నాలుగేళ్లుగా కోరుతున్నా పట్టించుకోవటంలేదని వాపోయారు. మరోవైపు మంగళగిరి నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాలను పోలీసుల సాయంతో ప్రభుత్వం బలవంతంగా తెరిపిస్తోంది. మంగళగిరి గండాలయ్యపేటలో అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచేందుకు వచ్చిన సిబ్బందిని కార్యకర్తలు, C.I.T.U. నేతలు అడ్డుకున్నారు. ప్రభుత్వం తమపై మొండిగా వ్యవహరిస్తోందని కార్యకర్తలు మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఎలా బుద్ధి చెప్పాలో తమకు తెలుసునని హెచ్చరించారు.

విజయవాడ ధర్నాచౌక్‌ నుంచి రైల్వే స్టేషన్‌వరకు అంగన్వాడీలు భారీ ర్యాలీ చేశారు. కనీస వేతనాలు, ఇతర డిమాండ్లు పరిష్కరించేవరకు సమ్మెను ఉద్ధృతం చేస్తామని కార్యకర్తలు హెచ్చరించారు. N.T.R. జిల్లా నందిగామ R.D.O. కార్యాయలం ముట్టడికి అంగన్వాడీలు యత్నించగా... పోలీసుల బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. కార్యాలయం గేటుకు తాళం వేసి నిలువరించారు.


ప్రకాశం జిల్లా కనిగిరిలో అంగన్వాడీలు భారీ ర్యాలీ నిర్వహించారు. కనిగిరి డివిజన్ పరిధిలోని అన్ని I.C.D.S. ప్రాజెక్టులకు చెందిన అంగన్వాడీలు ఇందులో పాల్గొన్నారు. R.D.O. కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టేందుకు ఎవరు అనుమతిచ్చారని R.D.O.ను నిలదీశారు. తాళాలు పగలగొట్టినవారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు.

పార్వతీపురం జిల్లా పాలకొండలో అంగన్వాడీలు ర్యాలీ చేశారు. R.T.C. కాంప్లెక్స్‌ నుంచి R.D.O. కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ R.D.O.కు వినతిపత్రం అందించారు. విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అంగన్వాడీలు R.D.O. కార్యాలయాల ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా తెరిపించటాన్ని బొబ్బిలి అంగన్వాడీ కార్యకర్తలు తప్పుబట్టారు. కేంద్రాలను సచివాలయ ఉద్యోగులకు అప్పజెప్పటం తగదన్నారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. ప్రధాన వీధుల్లో భిక్షాటన చేస్తూ ప్రజలకు తమ సమస్యలను వివరించారు. ప్రభుత్వతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గోడు పట్టించుకునే నాథుడే కరవయ్యాడని ఆవేదన చెందారు. సింగనమల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద చెవిలో పువ్వు పెట్టుకుని, మోకాళ్లపై నించుని భగభగ మండే సూర్యుడిని చూడు- అంగన్వాడీ వేదన చూడు అంటూ నిరసన తెలిపారు. జీతాలు పెంచాలంటూ తిరుపతిలో అంగన్వాడీలు నినాదాలు చేశారు. తెలంగాణ కంటే అదనంగా చెల్లిస్తామంటూ ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకోవాలని డిమాండ్‍ చేశారు.


Tags

Read MoreRead Less
Next Story