Shivoham : తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు..

Shivoham :  తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు..
శైవ క్షేత్రాలు కిట‌కిట‌..

మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు శివనామస్మరణతో మారు మోగాయి. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శైవక్షేత్రాలు భక్తులతో కోలాహలంగా మారాయి. ఉదయం నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తజనం. పరమశివుడి సేవలో పరవశించారు. ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలతో... మొక్కులు తీర్చుకున్నారు. హర హర మహాదేవ శంభో శంకరా అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. అన్ని శివాలయాల్లో పంచాక్షరి మంత్రం మారుమోగింది.

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. స్వామి, ఆలయానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో.. వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివార్ల ఊరేగింపు కోలాహలంగా సాగింది. ప్రసిద్ధి గాంచిన కోటప్పకొండ తిరునాళ్లకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి... దేవదేవుడి సేవలో తరించారు. రద్దీకి తగ్గట్టుగా కొండపై బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో... భక్తులకు ఇక్కట్లు తప్పలేదు. రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కర్ ఘాట్ వద్ద భారీగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. నెల్లూరులోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు.

ఉమ్మడి కడప జిల్లాలోని శివాలయాలు భక్తులతో సందడిగా నెలకొన్నాయి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకేశ్వరుని ఆలయానికి భక్తులు బారులు తీరారు. ఏలూరు జిల్లాలోని పలు శైవ క్షేత్రాల వద్ద తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేపట్టారు. కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధ పంచారామ పుణ్యక్షేత్రం శ్రీచాళుక్య కుమార పంచారామ క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. విశాఖ ఆర్కే బీచ్‌లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో శైవక్షేత్రాలు.... శివ నామస్మరణలతో మార్మోగాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలసలోని ఎండల మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.


తిరుపతిలోని కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రిపర్వదినాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉద‌యం 6 గంట‌ల‌కు స‌ర్వద‌ర్శనం ప్రారంభం కాగా భక్తులు కపిలేశ్వరస్వామి, కామాక్షి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భోగితేరు ఊరేగింపు రథోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story