రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు : నారా లోకేశ్

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు : నారా లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. ట్విట్టర్‌ ద్వారా రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కూరగాయల నుంచి పెట్రోలు వరకు ధరలన్నీ ఆకాశంలోకి రాకెట్ బాంబుల్లా దూసుకుపోయి భయపెడుతున్నాయని ట్వీట్‌ చేశారు. వార్డు నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవినీతి హైడ్రోజెన్ బాంబులు నిత్యం పేలుతున్నాయని విమర్శించారు. ద్వాపర యుగంలో ఒక్కడే నరకాసురుడు.. కానీ... వైసీపీ పాలనలో వీధికో నరకాసురుడు జనాలను భయపెడుతున్నాడని ట్వీట్లో పేర్కొన్నారు.. పరిస్థితులు ఇలా ఉంటే దీపావళి ఎలా అంటూ భయపడవద్దని..... ప్రతి ఇల్లూ సంతోషాలతో కళకళలాడే రోజులు తప్పకుండా వస్తాయని భరోసా ఇచ్చారు.

దీపావళితోపాటు ఈ రోజు మాజీ ప్రధాని నెహ్రూ జయంతి కావడంతో... పిల్లలకు ట్విట్టర్‌లో జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు లోకేష్‌. కరోనా చుట్టుముడుతుంటే పిల్లలు ప్రాణాలు పణంగా పెట్టి బడికి వెళ్లాల్సివస్తోందన్నారు. మరోవైపు పసిమొగ్గలపై అత్యాచారాలు మితిమీరుతున్నాయని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న నంద్యాలలో ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్నారు. బాలలకు మనమిచ్చే భవిష్యత్తు ఇదేనా అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు లోకేష్‌. బాలల హక్కుల రక్షణకు, బాలలపై లైంగిక దాడులు, అక్రమ తరలింపు వంటి చర్యలను అరికట్టేందుకు గతంలో 'భారత యాత్ర' చేపట్టిన కైలాశ్‌ సత్యార్థితో పాటు... నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వీధుల్లో పాదయాత్ర చేసారని లోకేష్ గుర్తు చేశారు. రేపటి సమాజం పట్ల తెలుగుదేశం పార్టీకి ఉండే నిబద్దత అలాంటిదన్నారు. ప్రభుత్వం ఇకనుంచైనా రేపటి సమాజం గురించి బాధ్యతాయుతంగా ఆలోచించాలని ట్విట్టర్‌లో సూచించారు లోకేష్‌.

Tags

Read MoreRead Less
Next Story