Cyclone Michaung: పంట నష్టం... రైతన్నకు తీరని కష్టం

Cyclone Michaung: పంట నష్టం... రైతన్నకు తీరని కష్టం
ఆంధ్రప్రదేశ్‌ అన్నదాతను ముంచేసిన మిచౌంగ్‌ తుఫాను

ఆంధ్రప్రదేశ్‌ రైతులను మిగ్‌ జాం తుపాను కోలుకోలేని దెబ్బతీసింది. ఎడతెరిపిలేని వానలకు వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. చాలా ప్రాంతాల్లో పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వేల ఎకరాల్లో.... అరటి, కూరగాయల పంటలు దెబ్బతినడంతో రైతులు బోరుమంటున్నారు. కల్లాలలో ఉన్న ధాన్యం తడిసిపోతున్నా..ప్రభుత్వం స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. మిగ్‌ జాం తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. కృష్ణా జిల్లా..మోపిదేవి మండలం కోసురువారి పాలెంలో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. కమ్మనమోలు,చోడవరం, వక్క పట్లవారిపాలెం, రేమాలవారిపాలెం తదితర ప్రాంతాల్లో.. వరి పంట నేలకొరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వర్షాలకు వరి పొలాలు నేల వాలాయి. కోడూరులో పంట వర్షానికి తడిచిపోయింది.

మైలవరంలో పత్తిపంట నీట మునిగింది. గుడివాడ వద్ద గుడ్లవల్లేరు మండలంలో పొలాలు నీట మునిగాయి. గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో శనగ, వరి పంటలు నీట మునిగాయి. దుగ్గిరాల మండలంలో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. రేపల్లెలో వేల ఎకరాల్లో వరి నీటమునిగింది. కోనసీమ జిల్లాలో వరిపంట నేలవాలి పూర్తిగా దెబ్బతింది. కల్లాలలో ఉన్న ధాన్యం తడిసిపోతున్నా ప్రభుత్వం స్పందించడంలేదని.... రైతులు వాపోతున్నారు. వర్షానికి నీరు చేరి.. మునగ, తమలపాకు తోటలకు నష్టం వాటిల్లింది. శ్రీసత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలంలో వరి దెబ్బతింది. కలాల్లో ధాన్యం తడిసిపోయింది. బాపట్ల జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. పర్చూరు ప్రాంతంలో పొలాలు నీట మునిగాయి. నీట మునిగిన పంటను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు.


పల్నాడు జిల్లాలో అరటి, పొగాకు తోటల్లోకి.. వరద చేరింది. అన్నమయ్య జిల్లాలో 2 వేల 740 ఎకరాల్లో... అరటి పంట దెబ్బతింది. వేల ఎకరాల్లో....... అరటి పంట నేలకూలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తుఫాను ధాటికి నష్టం వాటిల్లిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు వెల్లడించారు. తణుకు మండలంలో పంట నష్టాన్ని పరిశీలించిన ఆయన... రైతులు అధైర్య పడవద్దన్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పొలాలన్నీ జలమయమయ్యాయి. నందిగామ మండలంలో రైతులు పంటను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ధాన్యం తడవకుండా ఉండేందుకు... టెంటు వేశారు. జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో కోతలకు సిద్ధంగా ఉన్న పైరంతా నేలవాలింది. పొలాల్లో ఆరబెట్టిన ధాన్యమంతా తడిసి రైతులు లబోదిబోమంటున్నారు. వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని.... ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.


Tags

Read MoreRead Less
Next Story