ఏపీలో రైతులను నట్టేట ముంచిన భారీ వర్షాలు

ఏపీలో రైతులను నట్టేట ముంచిన భారీ వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వర్షం పడుతోంది. వరద వేగానికి రోడ్లు కోతకు గురయ్యాయి. ముఖ్యంగా నంద్యాల, ఆత్మకూరు, రుద్రవరం మండలాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. హంద్రీ, కుందూనదులు వరదలతో పోటెత్తాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కర్నూలు జిల్లాలో నాలుగు చోట్ల అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

నెల్లూరు జిల్లా రైతులు గతంలో ఎప్పుడూ లేనంతగా నష్టాల బారిన పడుతున్నారు. ఎక్కడికక్కడ పంట చేతికందే సమయంలో కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యం నేల పాలవుతుంది. అన్నదాతలకు ఆవేదనే మిగులుతోంది. ఈ ఏడాది సోమశిల పరిధిలోని డెల్టా రెండో పంటగా దాదాపు మూడున్నర లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. పంట కోత కోసే సమయంలో ఒక్కసారిగా అల్పపీడనాలు, అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచేశాయి.

కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో అధికారులు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణమ్మ ఉగ్రరూపంతో కృష్ణలంక, తారక రమానగర్‌, రణదివే నగర్‌, రాణిగారితోట, రామలింగేశ్వర నగర్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద నీరు ఇళ్లను ముంచెత్తడంతో మంపు బాధితులు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.

అటు.. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 2లక్షల 21వేల 888 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.40 అడుగుల మేర నీరు నిల్వ ఉంది.

తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేరు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో పెద్దాపురం మండలం కాండ్రకోటలో రోడ్డు గండి పడింది. దీంతో ముంపు ప్రాంతాన్ని టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. రైతుల సమస్యలు పక్కనబెట్టి చంద్రబాబును విమర్శించడమే మంత్రి కన్నబాబు పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. వరదల్లో రైతులు నష్టపోతే ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదని తెలిపారు. అల్పపీడన ప్రభావంతో మరో రెండ్రోజుల పాటు ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story