AP: విశాఖలో తహసీల్దారు హత్యతో భయాందోళనలు

AP: విశాఖలో తహసీల్దారు హత్యతో భయాందోళనలు
అధికారవర్గాల్లో భయాందోళన... అధికారులపై విపరీత ఒత్తిళ్లు

ప్రశాంతమైన విశాఖలో భూములకు విలువ పెరగడంతో వివాదాలూ అదే స్థాయిలో పెరిగాయి. కొందరు ముఠాలుగా ఏర్పడి నగర శివార్లలో కోట్ల రూపాయల విలువైన భూములను కబ్జా చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తిరగబడుతున్నారు. అధికారపార్టీ నేతలు చెప్పినట్లు ఉద్యోగులు చేయకపోతే ప్రశాంతంగా పని చేసుకునే వాతావరణం లేకుండా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వారు చెప్పినట్లు వింటే పరిస్థితి ఒకలా లేకుంటే మరోలా ఉంటోంది. ఈ క్రమంలో అధికారులపై విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్నాయి. కొందరు నేతలు అధికారులను పావులుగా ఉపయోగించుకొని ఖరీదైన భూముల విషయంలో ఎక్కడివరకైనా వెళ్తున్నారు.


వైసీపీ ప్రభుత్వం విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన తర్వాత కబ్జాదారుల ఆగడాలు ఎక్కువయ్యాయి. బెదిరింపుల సంస్కృతి ఎక్కువైంది. స్థలాలకు విలువ పెరిగి చివరికి కొందరి ప్రాణాల మీదకు వస్తోంది. రెండేళ్ల క్రితం కొమ్మాదిలో వంద కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్‌ స్థలం విషయంలో ఓ MLA నుంచి విశాఖ గ్రామీణ తహసీల్దార్‌ నరసింహమూర్తికి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. రిజిస్ట్రేషన్‌కు అడ్డుగా ఉన్న వన్‌బీలో బ్లాక్‌ చేసిన రెడ్‌మార్క్‌ తొలగించాలని సదరు ఎమ్మెల్యే తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి డిమాండు చేశారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆయన తొలగించేశారు. అప్పట్లో ఇది చర్చనీయాంశం కావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇందులో విధానపరమైన తప్పిదం చోటు చేసుకుందని గుర్తించి తహసీల్దారును సస్పెండ్‌ చేశారు.


ఏడాదిన్నర క్రితం సత్తివానిపాలెంలోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమించి నిర్మించిన ప్రహరీని రెవెన్యూ అధికారులు కూల్చుతుండగా స్థానిక వైసీపీ నేత అడ్డుకున్నాడు. అక్కడున్న రెవెన్యూ ఉద్యోగులపై దాడులకు పాల్పడ్డాడు. ఓ ఆర్‌ఐపై చేయిచేసుకున్నాడు. అప్పట్లో రెవెన్యూవర్గాల్లో ఇది చర్చనీయాంశమైంది. స్థిరాస్తి రంగంతో సంబంధమున్న వైసీపీ నేత మధురవాడ బక్కన్నపాలెంలో చేపట్టిన నిర్మాణ పనులు వివాదాస్పదమయ్యాయి. సదరు నేత తన స్థలాన్ని ఆక్రమించి రోడ్డు వేస్తున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి ఆరోపించారు. ఈ నేపథ్యంలో కలెక్టరు విచారణకు ఆదేశించగా..అప్పటి విశాఖ గ్రామీణ తహసీల్దారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సమయంలో అధికారపార్టీ నేతకు అనుకూలంగా నివేదిక ఇచ్చేలా అధికారిపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. తర్వాత కొద్దిరోజులకే అక్కడి నుంచి బదిలీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story