Dharmavaram: రైతుల పొలాల్లో అక్రమ విద్యుత్ లైన్లు

Dharmavaram: రైతుల పొలాల్లో అక్రమ విద్యుత్ లైన్లు

అధికారం మాదే.. మేము ఏమైనా చేస్తాం.. అడిగే వారెవరు అనే విధంగా ధర్మవరం నియోజకవర్గంలో పరిస్థితి తయారయ్యింది. అది సాగునీటి ప్రాజెక్టులైనా.. రోడ్డు విస్తరణలైనా.. చివరకు విద్యుత్తు లైన్ల ఏర్పాటు అయినా సరే ప్రజలతో పనిలేదు. తమ స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం. మాకు నచ్చినట్టు మేము చేసుకుంటూ పోతాం అంటూ అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు.

తాజాగా ధర్మవరం సమీపంలోని తారకాపురం నుంచి గరుడంపల్లి వరకు ఏర్పాటు చేస్తున్న 132 కేవీ విద్యుత్తు లైన్‌ల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు రైతులకు శాపంగా మారింది. వాస్తవంగా ఇక్కడ ఇంతకు ముందే ఒక విద్యుత్ లైన్ ఉంది. దానికి అదనంగా 132 కేవి లైన్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇది తారకాపురం నుంచి లైన్ నేరుగా వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యే కేతిరెడ్డికి చెందిన సూర్య ఎస్టేట్స్ కు రాగానే ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇక్కడ రైతుల భూముల్లో 132 కేవి విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రైతులు పెద్ద ఎత్తున భూములు కోల్పోతున్నారు. కనీసం ఈ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు నోటీసులు కూడా ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు తమకు సమాచారం కూడా ఇవ్వకుండా మా భూముల్లో లైన్లు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఉన్న లైన్ ప్రకారం వెళ్లకుండా ఇక్కడ మలుపు తిరగడం ఏంటని వారు నిలదీస్తున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డికి చెందిన సూర్య స్టేట్స్, జగనన్న స్మార్ట్ సిటీకి ఏమాత్రం ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతోనే రైతులను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లైన్ ఏర్పాటు చేస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ వారు నిరసనకు దిగారు. పురుగుల మందు డబ్బాలను పట్టుకొని లైన్ లు ఏర్పాటు చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని వారు హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story