AP: కృష్ణా నదిని చెరపట్టిన ఇసుకాసురులు

AP: కృష్ణా నదిని చెరపట్టిన ఇసుకాసురులు
అడ్డగోలుగా నదీ గర్భాన్ని తవ్వేస్తున్న ఇసుకాసురులు..... దోపిడీని ప్రశ్నిస్తే విచక్షణారహిత దాడులు

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక విస్తారంగా లభించే ప్రాంతాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా ఇసుకాసురులకు వరంగా మారింది. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలో మొదలై.... బాపట్ల జిల్లాలోని రేపల్లె వరకు ఇసుక తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. చామర్రు, మల్లాది, అమరావతి, వైకుంఠపురం, కొల్లిపర, గుండిమెడ, బొమ్మవానిపాలెం, గాజుల్లంక, జువ్వలపాలెం, రేపల్లెలో చాలాచోట్ల నదీగర్భంలోనూ తవ్వకాలు చేస్తున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తీర్పును, ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ ఆదేశాలను ధిక్కరించి మరీ నదీ గర్భాన్ని కొల్లగొడుతున్నారు. పల్నాడు జిల్లాలో కృష్ణమ్మ ప్రవేశించిన దగ్గరి నుంచి బాపట్ల జిల్లాలో సముద్రంలో కలిసేవరకు ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. దోపిడీని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికారులూ చూసీచూడనట్లు వ్యవహరించడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.


అనుమతులు ముగిసినా అడ్డగోలుగా ఇసుకను కొల్లగొడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ భారీ యంత్రాలతో తవ్వి.. సొమ్ము చేసుకుంటున్నారు. గట్టున ఉన్న ఇసుక అయిపోగానే... నదీగర్భాన్ని కొల్లగొట్టేందుకు... పెద్దపెద్ద తూములు, బండరాళ్లు, మట్టి పోసి దారులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో లారీల్లో నింపి తరలిస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడంతో... నది స్వరూపాన్నే కోల్పోయింది. నదీపాయలకు అడ్డంకులు సృష్టించడంతో వరదలు వచ్చినప్పుడు ప్రవాహం దిశ మార్చుకుని ఒడ్డు కోతకు గురవుతోంది. రాత్రివేళ తవ్వకాలు చేయకూడదనే నిబంధన ఉన్నా... మచ్చుకైనా అమలు కావడం లేదు. ప్రకృతికి పెద్దఎత్తున హాని జరుగుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన చేస్తున్నా.... అక్రమార్కుల ముందు అరణ్యరోదనే అవుతోంది. రాష్ట్ర సచివాలయం, సీఎం నివాసం, మంత్రులు, వీఐపీల నివాసాలకు కిలోమీటర్ల దూరంలోనే దోపిడీ జరుగుతున్నా... పట్టించుకునేవారే కరవయ్యారు.


ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇసుక తవ్వకాలకు జీసీకేసీ సంస్థకు సర్కారు అనుమతులిచ్చింది. పర్యావరణ, ఇతర అనుమతులు అన్నీ వచ్చాకే తవ్వకాలు చేయాలన్న నిబంధన ఉన్నా... వాటిని పట్టించుకోకుండా అడ్డగోలుగా దోపిడీకి తెగబడ్డారు. సహజ సంపదను అధికార పార్టీ నేతలు చాలాచోట్ల కొల్లగొడుతున్నారు. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన ముఖ్యనేతల సమీప బంధువు ఇసుక తవ్వకాలను పర్యవేక్షిస్తున్నారు. అతనికి స్థానిక ఎమ్మెల్యేలు, వారి అనుచరులు సహకరిస్తున్నారు. అధికార పార్టీ నేతల ప్రమేయంతోనే ఇసుక తవ్వకాలు జరగడంతో.. యంత్రాంగం నిబంధనలు అమలు చేయలేకపోతోంది. తాము చెప్పిందే చట్టం అన్నట్లుగా సదరు నేతలు చెలరేగిపోతున్నారు. మార్గదర్శకాలకు పాతరేసి విచ్చలవిడిగా ఇసుక రవాణా చేస్తున్నారు. సంబంధిత శాఖలు మిన్నకుండడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాయి. భారీ ఇసుక లారీల రాకపోకలతో గ్రామీణ రహదారులు ధ్వంసమవుతున్నా పట్టించుకోవడం లేదు. స్థానికులు ఫిర్యాదు చేసినా, లారీలను అడ్డగించినా చర్యలు తీసుకోవడం లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం నిత్యకృతమయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story