Top

జనసేనాని ఆశించిన హామీ దొరకలేదా?

జనసేనాని ఆశించిన హామీ దొరకలేదా?
X

తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేయడం కోసం జనసేనాని పడుతున్న తాపత్రయం అందరికీ అర్ధం అవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అని ప్రకటించి, అభ్యర్ధులను ప్రచారంలోకి దింపే సమయంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. హడావుడిగా నాదెండ్లను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. దాదాపు రెండు రోజుల పాటు కేంద్ర బీజేపీ పెద్దల అపాయింట్‌మెంట్ కోసం వేచి చూశారు. తిరుపతిలో పోటీ చేసేది తామేనని ఈ మధ్యలోనే బీజేపీ రాష్ట్ర నేతలు సిగ్నల్స్ ఇచ్చినప్పటికీ.. ఎక్కడో ఉండిపోయిన చిన్న ఆశతో జేపీ నడ్డాను కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వచ్చిన తరువాత.. పవన్ చేసిన కామెంట్స్ చూస్తుంటే ఆశించిన హామీ దొరకలేదనే అర్ధం అవుతోంది.

నడ్డాతో జరిగిన భేటీలో తిరుపతి బైపోల్స్ గురించే ప్రత్యేకంగా మాట్లాడామని పవన్ చెప్పారు. అయితే, అభ్యర్ధి ఎవరు అనేది మాత్రం క్లారిటీ రాలేదు. తిరుపతిలో ఏ పార్టీ అభ్యర్ధి పోటీ చేయాలనే దానిపై ఓ కమిటీ వేస్తామని నడ్డా చెప్పారని పవన్ చెప్పుకొచ్చారు. పోటీలో నిలిచేది బీజేపీనా, జనసేననా అనేది రెండ్రోజుల్లో తేలిపోతుందని జనసేనాని స్టేట్ మెంట్ ఇచ్చారు.

నడ్డా పిలిస్తేనే ఢిల్లీ వచ్చామని పవన్‌కల్యాణ్ తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికతో పాటు అమరావతి, పోలవరంపై కూడా చర్చించామని చెప్పారు. భవిష్యత్‌లో ఏపీలో రెండు పార్టీలు ఎలా ముందుకెళ్లాలన్న అంశంపైనా చర్చించినట్లు చెప్పారు. అమరావతి రైతులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారన్నారు పవన్. రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతిపైనా, దేవాలయాలపై జరుగుతున్న దాడులపైనా, లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై కూడా నడ్డాతో చర్చించినట్లు పవన్‌కల్యాణ్ తెలిపారు. పైకి ఎన్ని చెప్పినా.. తిరుపతి బరిలో జనసేన అభ్యర్థి ఉంటారా? లేక బీజేపీ అభ్యర్థి ఉంటారా అన్నదే ముఖ్యం. ఈ అంశంపై క్లారిటీ రాకపోవడంతో మరో రెండు రోజుల పాటు సస్పెన్స్ తప్పేలా లేదు.

Next Story

RELATED STORIES