కచ్చులూరు బోటు ప్రమాదానికి ఏడాది.. ఆ ఐదు మృతదేహాల ఆచూకే లేదు..

కచ్చులూరు బోటు ప్రమాదానికి ఏడాది.. ఆ ఐదు మృతదేహాల ఆచూకే లేదు..
ప్రకృతి మాత పచ్చని చీర కట్టినట్లుండే పాపికొండల్లో హొయలు పోతూ సాగే గోదావరిని చూసేందుకు రెండు కళ్లు చాలవు. అలాంటి సుందర దృశ్యాన్ని ఒక్కసారిగా విషాదం ఆవహించింది..

ప్రకృతి మాత పచ్చని చీర కట్టినట్లుండే పాపికొండల్లో హొయలు పోతూ సాగే గోదావరిని చూసేందుకు రెండు కళ్లు చాలవు. అలాంటి సుందర దృశ్యాన్ని ఒక్కసారిగా విషాదం ఆవహించింది. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు వశిష్ట పున్నమి రాయల్‌ బోటులో బయల్దేరిన 77 మంది ప్రయాణికులు.. గోదావరి కల్లోలానికి కకా వికలమయ్యారు. గత ఏడాది సెప్టెంబర్‌ 15 వ తేదీన రాజమండ్రిలో బయల్దేరిన బోటు... తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద మునిగిపోయింది. నాటి దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు చెందిన 51 మంది జలసమాధి కాగా.. వీరిలో ఐదుగురి మృతదేహాలు లభించనే లేదు. 26 మందిని మాత్రం స్థానికులు సురక్షితంగా కాపాడారు..

అత్యంత కఠినమైన పరిస్థితుల్లో జరిగిన ఈ ప్రమాదంలో నీట మునిగిన బోటును తీసేందుకు... వివిధ బృందాలు కలిసి 38 రోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది. తొలుత బోటును బయటకు తెచ్చేందుకు ముందుకువచ్చిన నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ తర్వాత చేతులెత్తేశాయి. దీంతో రాయల్ వశిష్ట బయటికి రావటం అసాధ్యమని భావించారంతా. కానీ ఆసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు ధర్మాడి సత్యం. బలిమెల, నాగార్జునసాగర్లో బోట్లను బయటకు తీసిన అనుభవాన్నంతా రంగరించి... రాయల్‌ వశిష్టను వెలికితీసే బాధ్యతను చేపట్టారు. మొదట్లో ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. బోటు పూర్తిగా ఇసుకలో కూరుకుపోవడం... పలుమార్లు ఇనుప రోప్‌లు తెగిపోవడంతో.. రెండు సార్లు ఆపరేషన్‌ను నిలిపివేశారు. అయితే మూడో సారి స్కూబా డైవర్ల సాయంతో బోటు ఫ్యాన్‌ ఛాంబర్‌కు తాళ్లను బిగించి... ప్రొక్లెయినర్‌ సాయంతో నెమ్మదిగా బోటును బయటకు తీసుకొచ్చారు.

కచ్చులూరు బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులు.. దాదాపు నెల రోజుల పాటు ప్రత్యక్ష నరకం అనుభవించారు. కుళ్లిపోయిన మృతదేహాలను గుర్తు పట్టలేక... తమ వారు ఎక్కడున్నారో తెలుసుకోలేక... గుండెలు అవిసేలా రోధించారు. ఎన్నో వ్యయ ప్రయాలకు ఓర్చి రాయల్‌ వశిష్ట బోటును బయటకు తీసుకొచ్చినా ఇంకా ఐదుగురి ఆచూకీ మాత్రం దొరకకుండానే పోయింది. సరదాగా గడుపుదామని వెళ్లిన తమవారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడాన్ని... ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఏడాది గడచినా ఆ నాటి విషాదాన్ని ఇంకా మరచిపోలేకపోతున్నారు. అలాగే నిబంధనలను తుంగలో తొక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయితే దానిపై విచారణ కమిటీ ఏమీ తేల్చలేకపోయింది. ఏపీ జలవనరుల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఛైర్మన్‌గా విచారణ కమిటీ వేయగా.. ప్రమాదానికి కారణాలను పెద్దగా విశ్లేషించకుండానే... భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా సూచనలు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story