kotamreddy sridhar reddy : కార్యకర్తలే నా రక్షణ కవచం.. తగ్గేదే లే..!

kotamreddy sridhar reddy : కార్యకర్తలే నా రక్షణ కవచం.. తగ్గేదే లే..!
ప్రభుత్వానికి నేనిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే..

అన్నకు జై కొడితేనే భద్రత కల్పిస్తారా..? లేకుంటే, మనవాళ్లయినా, పరాయి వాళ్లయినా కష్టాలు తప్పవా..? ఎమ్మెల్యేలు భద్రత విషయంలో జగన్‌ ప్రభుత్వం దొంగాట ఆడుతోందా..? సొంత పార్టీ ఎమ్మెల్యేల విషయంలోనూ ఇలాంటి ధోరణిని ఎలా చూడాలి..? బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటే భద్రత మరింత పెంచాల్సింది పోయి ఇలా సగానికి తగ్గించడమేంటి..? ఇవే ప్రశ్నలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.. మొన్నామధ్య వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సెక్యూరిటీ తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి సెక్యూరిటీని సగానికి కట్‌ చేసింది 2 ప్లస్‌ 2 భద్రతను 1 ప్లస్‌ 1కు కుదించేసింది. అయితే జగన్‌ ప్రభుత్వ తీరుకు నిరసనగా వన్‌ ప్లప్‌ వన్‌ గన్‌ మెన్లను కూడా కోటంరెడ్డి తిరస్కరించారు. ఇదే తన రిటర్న్‌ గిఫ్ట్‌ అంటూ కౌంటర్‌ ఇచ్చారు.

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి సెక్యూరిటీని జగన్‌ ప్రభుత్వం సగానికి తగ్గించడంతో దీనిపై ఎమ్మెల్యే గట్టిగానే రియాక్ట్‌ అయ్యారు. ఉన్న గన్‌మెన్లను కూడా ఆయన తిరస్కరించారు. ప్రభుత్వానికి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తున్నానంటూ వాళ్లను కూడా తిప్పి పంపారు. కార్యకర్తలే తనకు రక్షణ కవచాలని చెప్పారు. రాష్ట్ర పెద్దల ప్రోద్బలంతోనే తనకు భద్రత తగ్గించారని కోటంరెడ్డి ఫైరయ్యారు. ఓ వైపు బెదిరింపు కాల్స్‌ వస్తుంటే భద్రతను తగ్గించి మానసికంగా వేధించాలని చూస్తున్నారని మండిపడ్డారు. గన్‌మెన్లను ఉపసంహరించుకునే సమయంలో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గన్‌మెన్లను హగ్‌ చేసుకున్నారు. ఈ సందర్భంలో గన్‌మెన్లు కూడా భావోద్వేగానికి గురయ్యి కంటతడి పెట్టుకున్నారు.

గతంలో వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి విషయంలోనూ జగన్‌ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. ప్రభుత్వంపై విమర్శలు చేసిన మరుసటి రోజు ఆ నియోజకవర్గానికి వైసీపీ కొత్త ఇన్‌ఛార్జ్‌ని ప్రకటించింది. రెండ్రోజుల తర్వాత ఆనం సెక్యూరిటీని తగ్గించింది. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వంతు వచ్చింది. ఇలాంటి చర్యలతో తన గొంతు పెరుగుతుందే తప్ప తగ్గదని స్ట్రాంగ్‌గా బదులిచ్చారు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి.

Tags

Read MoreRead Less
Next Story