విశాఖలో ఎక్కువైన భూ కబ్జాలు.. ఏకంగా చెరువునే కబ్జా

విశాఖలో ఎక్కువైన భూ కబ్జాలు.. ఏకంగా చెరువునే కబ్జా
విశాఖను పరిపాలన రాజధాని అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన తరువాత భూ కబ్జాలు ఎక్కువ అయ్యాయని ఇప్పటికే ఆందోళనలు పెరిగాయి.. అయితే ఇప్పుడు పక్కనే..

విశాఖను పరిపాలన రాజధాని అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన తరువాత భూ కబ్జాలు ఎక్కువ అయ్యాయని ఇప్పటికే ఆందోళనలు పెరిగాయి.. అయితే ఇప్పుడు పక్కనే ఉన్న విజయనగరంపైనా కబ్జారాయుళ్లు ఫోకస్‌ చేశారని స్థానికులు భయపడుతున్నారు. మొన్నటి వరకు ప్రభుత్వ బంజర్లను, దేవాలయాల భూములను కబ్జా చేయటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఇప్పుడు ఏకంగా పట్టణంలో ఉన్న చెరువునే కబ్జా చేసేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దాసన్నపేటకు ఆనుకొని ఉన్న పట్టణ సర్వే నెంబరు 815లో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్ర చెరువుని ఎవరికీ తెలియకుండా కప్పసే ప్రయత్నం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చెరువుని మూడొంతులు కప్పేశారని ఆరోపిస్తున్నారు. పూర్వం విజయనగరం మహారాజు.. ఈనాంగా ఇచ్చిన భూములు ఈ చెరువు నీరుతోనే సాగయ్యేవి.. అయితే 1956లో ఈనాంలు రద్దు చేసిన అప్పటి ప్రభుత్వం ఓ చట్టాన్ని రూపొందించింది. తర్వాత కాలంలో చెరువు కిందున్న భూములు అమ్మకాలు జరిగిపోయాయి. అక్కడ ఖరీదైన భవనాలు కూడా కట్టేశారు. కబ్జాదారుల దృష్టి ప్రస్తుతం ఈ చెరువుపై పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో రాజు ఎవరికైతే ఈనాం కింద భూములు ఇచ్చారో.. వారికే ఈ చెరువు కూడా చెందుతుందని భూబకాసురులు వాదిస్తున్నారు. మరోవైపు రెవిన్యూ అధికారులు మాత్రం ఈ ఎర్ర చెరువు రెవిన్యూ రికార్డుల్లో వుందని.. సుప్రీం తీర్పును అనుసరించి చెరువులను ఎవరూ కబ్జాలు చేయటానికి వీల్లేదంటున్నారు. ఎర్రచెరువు ఎవరిది అన్న విషయం ఇంకా కోర్టు పరిధిలో ఉండగా.. ఈ దశలో మరో అడుగు ముందుకేసిన ఇద్దరు వైసిపి యువ నేతలు చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అనంతపురానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులతో బేరం కుదుర్చుకున్నారని సుమారు తొమ్మిది ఎకరాలు చెరువు పూర్తిగా కప్పేసి.. తమకు అప్పగిస్తే 12 కోట్లు రూపాయిలు ఇవ్వాలన్న ఒప్పందం జరిగిందంటూ స్థానికులు చెప్తున్నారు. పడమర దాసన్నపేట, ఉత్తరాన బాబామెట్ట, దక్షిణాన సింగపూర్ సిటీ మధ్యలో ఎర్ర చెరువు వుండటంతో దీని ధర ఒక్క సారిగా ఆకాశాన్ని తాకింది. దీంతో అధికార పార్టీలో కాస్త పలుకబడి ఉన్న ఇద్దరు వైసీపీ నేతలు ఈ కబ్జాకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story