Tirumala Leopard Attack: తిరుమలలో బాలుడిపై దాడి... చిక్కిన చిరుత

Tirumala Leopard Attack: తిరుమలలో బాలుడిపై దాడి... చిక్కిన చిరుత
బాలుడిపై దాడి చేసిన గంటల వ్యవధిలోనే చిరుతను బంధించడంపై భక్తులు టీటీడీ అధికారులను అభినందిస్తున్నారు

తిరుమల నడక మార్గంలో మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత బోనులో చిక్కింది. దాడి అనంతరం అలిపిరి మార్గంలో 150 ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత సంచారాన్ని గమనించిన అటవీ శాఖ అధికారులు నిన్న సాయంత్రం రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు బోన్లను ఏర్పాటు చేశారు. రాత్రి 10 గంటల 45నిమిషాలకు చిరుత చిక్కింది. బోనులో చిక్కిన చిరుతను టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. బాలుడిపై దాడి చేసిన గంటల వ్యవధిలోనే చిరుతను బంధించడంపై భక్తులు టీటీడీ అధికారులను అభినందిస్తున్నారు.

గురువారం ఏడో మైలురాయి వద్ద బాలుడిపై చిరుత దాడి చేసింది. బాలుడ్ని నోట కరుచుకుని పొదల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. భక్తులు కేకలు వేయడంతో.. బాలుడ్ని వదిలేసి పరారైంది. తీవ్రగాయాలైన చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆ బాలుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.

చిరుత దాడి అనంతరం అలిపిరి మార్గంలో 150 ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. బాలుడిపై చిరుత దాడి చేసిన ప్రదేశాన్ని ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావుతం కాకుండా.. భక్తులను ఎలాంటి ఇబ్బంది కలగకుండా పలు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. భక్తులపై చిరుత మళ్లీ దాడి చేసే అవకాశం ఉండడంతో.. టీటీడీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. రాత్రి 7 గంటల తరువాత అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం నుంచి 200 మంది చొప్పున భక్తులను గ్రూపులుగా పంపుతున్నారు. వారి వెంట సెక్యూరిటీ గార్డ్‌ను ఉంచారు. చిన్న పిల్లలను గ్రూప్‌ మధ్యలో ఉంచుకుని అప్రమత్తంగా వెళ్లాలని సూచనలు చేశారు. అలిపిరి మార్గంలో రాత్రి 10 వరకు భక్తులను అనుమతించారు. ఎట్టకేలకు టీటీడీ అధికారుల ప్రయత్నాలు ఫలించి చిరుత చిక్కడంతో.. భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story