రైతులకు న్యాయం చేయకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించిన లోకేష్‌

రైతులకు న్యాయం చేయకపోతే పోరాటం చేస్తామని హెచ్చరించిన లోకేష్‌

వైసీపీ పాలనలో రైతులకు అన్యాయం జరుగుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు వచ్చి పంట నష్టం వాటిల్లితే.. రైతుల్ని ఎవరూ పరామర్శించకపోవడం దారుణమన్నారు. తుఫాను బీభత్సంతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. తక్షణమే పంట నష్టం అంచనా వేసి.. రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు, బాపట్ల మండలాల్లో దెబ్బతిన్న పంటపొలాల్లో లోకేశ్‌ పర్యటించారు. ముందుగా పొన్నూరు మండలం పచ్చల తాడిపర్రులో పంటలను పరిశీలించారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతోపాటు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొన్నూరులో మహిళలు భారీగా లోకేష్‌కు స్వాగతం పలికారు. పొన్నూరు నుంచి చింతలపూడి..బాపట్ల మండలంలో టీడీపీ నేతలు.. రైతులు స్వాగతం పలికారు.

పొన్నూరు తర్వాత... బాపట్ల మండలం ఈతేరు గ్రామంలో పంట పొలాలను లోకేష్‌ పరిశీలించారు. తరువాత అప్పికట్లలో రైతులతో ముఖాముఖిలో పాల్గొని మాట్లాడారు. రైతులకు పంటనష్టంతోపాటు కౌలు రైతులకు కూడా నష్ట పరిహారం చెల్లించాలని డిమెండ్ చేశారు.

రైతులకు న్యాయం చేయక పోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నప్పటికీ జగన్‌ సర్కారు కనీసం పరామర్శించడం లేదని లోకేష్ అన్నారు. అన్నదాతలకు న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తామని స్పష్టంచేశారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు అన్నీ పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. ఇసుక లేక అందరూ ఇబ్బంది పడుతున్నారని అన్నారు. 151 సీట్లు ఇచ్చిన ప్రజలకు... ధరలతో భారం మోపుతున్నారని విమర్శించారు.

ఎక్కడపడితే అక్కడ జగన్‌ విలాసవంతమైన ప్యాలెస్‌లు కట్టుకుంటున్నారని లోకేశ్‌ విమర్శించారు. రైతుల్ని పలకరించేవారు ఎవరూ లేరని అన్నారు. రైతుల పంట పొలాలకు విద్యుత్‌ మీటర్లు బిగిస్తే... పోరాడుతామని స్పష్టంచేశారు. నష్టపోయిన కౌలు రైతులు ఎకరానికి 30వేల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు.

గుంటూరు జిల్లాలో పంటల్ని పరిశీలించాక... ప్రకాశం జిల్లా చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో లోకేష్‌ పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. చీరాలలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి లోకేష్ నివాళులు అర్పించారు. ఆ తర్వాత.. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి కారంచేడులో తుపాను కారణంగా దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు.

సీఎం జగన్‌.. రైతులు సంతోషంగా ఉన్నారనే భ్రమలో ఉన్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. మంత్రులు రారు.. సహాయం ఎంత ఇస్తారో ప్రకటించరని మండిపడ్డారు. ఇన్‌పుట్‌ సబ్సిడీలు, ఇన్సూరెన్స్‌లు లేకుండా చేశారని లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతలకు అన్యాయం జరిగే ఉద్యమిస్తామని.. పంటపొలాలను పరిశీలించాక లోకేష్ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story