ఉమ్మడి గుంటూరు జిలాల్లో లోకేష్‌ యువగళం

ఉమ్మడి గుంటూరు జిలాల్లో లోకేష్‌ యువగళం
వైసిపి ప్రభుత్వం వచ్చాక తాండాల్లో ప్రజల జీవితం అస్తవ్యస్తంగా మారిందన్నారు


ఉమ్మడి గుంటూరు జిలాల్లో లోకేష్‌ యువగళం యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. దారి పొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ లోకేష్‌ ముందుకు సాగుతున్నారు. యాత్ర వినుకొండ నియోజకవర్గం నుంచి మాచర్ల నియోజక వర్గంలోకి ప్రవేశించింది. టీడీపీ ఇన్‌చార్జ్‌ జూలకంటి బ్రహ్మానందరెడ్డి లోకేష్‌కు ఘనస్వాగతం పలికారు. వినుకొండ నియోజకవర్గం మేళ్లవాగు గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు. గ్రామానికి రోడ్డు, తాగునీరు, బాల బాలికలకు హాస్టళ్లను ఏర్పాటు చేయాలని విన్నవించారు.

వైసిపి ప్రభుత్వం వచ్చాక తాండాల్లో ప్రజల జీవితం అస్తవ్యస్తంగా మారిందన్నారు లోకేష్‌. స్కూళ్ల విలీనం పేరుతో జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల నాలుగు లక్షల మంది గ్రామీణ విద్యార్థులు చదువుకు దూరమయ్యారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వినుకొండ గిరిజన తాండాల విద్యార్థులకోసం రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయంపై అవగాహన లేని సిఎం కారణంగా రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 3వస్థానంలో నిలిచిందన్నారు. NSP కాల్వ ఆధునీకరణ చేపట్టి కాల్వ చివరి భూములకు నీరందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వరికపూడిశెల ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని చేపట్టి బొల్లాపల్లి మండలానికి నీరందిస్తామని చెప్పారు.



మాచర్ల నియోజకవర్గంలో కారంపూడి విద్యార్థులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కారంపూడి మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఇంటర్‌, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారని లోకేష్‌ మండిపడ్డారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గతంలో అమలు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దుచేశారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే కారంపూడిలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంఖ్యను బట్టి డిగ్రీ కాలేజి అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు దూరప్రాంతాల్లో చదవాల్సి వచ్చినా... వారిపై ఎటువంటి భారంపడకుండా రీఎంబర్స్ మెంట్ పథకాన్ని అమలుచేస్తామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story