ఆర్టీసీ బస్సులో వృద్ధుడు మృతి.. మృతదేహాన్ని, భార్యను మధ్యలోనే దించేసిన సిబ్బంది

ఆర్టీసీ బస్సులో వృద్ధుడు మృతి.. మృతదేహాన్ని, భార్యను మధ్యలోనే దించేసిన సిబ్బంది
హృదయం ద్రవించే దృశ్యం విజయనగరం జిల్లాలో జరిగింది.

కష్టమో నష్టమో పండుటాకులుగా ఉన్నంత వరకు కలిసిమెలిసి ఉన్నారు. కాలం ఎవరినో ఒకరిని ముందు తీసుకెళ్తుంది. ఆ విషయం తెలిసిందే. కాని, ఇన్నాళ్లూ తోడున్న ఇంటాయన ఇక లేడన్న విషయం తెలిసి.. మరో హృదయం తట్టుకోలేకపోయింది. గుండెలవిసేలా ఏడ్చింది. పిల్లలు, మనవళ్లు ఉన్నా అనాథగా రోడ్డుపైనే విగతజీవిగా మారడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఈ హృదయం ద్రవించే దృశ్యం విజయనగరం జిల్లాలో జరిగింది.

సాలూరుకు చెందిన దాసరి పోలయ్య కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఆయన్ను భార్య పైడమ్మతో పాటు కుమారుడు సింహాచలం... జిల్లా ఆసుపత్రితో పాటు విశాఖపట్నం కేజీహెచ్‌లో వైద్యం అందించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. పార్వతీపురం పట్టణంలో దేవుడమ్మ ఉందని... అక్కడకు తీసుకెళ్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొందరు చెప్పడంతో నిన్న భర్తను తీసుకొని పైడమ్మ అక్కడికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో పార్వతీపురం నుంచి సాలూరుకు రావటానికి ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సు బొబ్బిలి పట్టణానికి చేరుకునేసరికి పోలయ్య మృతి చెందినట్లుగా కండక్టర్‌ గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని బస్సు నుంచి బయటకు దించేశారు. భర్త మృతదేహంతో తల్లడిల్లిన ఆ వృద్ధురాలిపై ఆర్టీసీ సిబ్బంది...తోటి ప్రయాణికులు జాలి చూపించలేదు. కనీసం అధికారులకు గానీ.. ఆమె బంధువులకు గానీ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మృతదేహాన్ని, ఆయన భార్యను దించేసి వెళ్లిపోయారు. దీంతో పైడమ్మ రోడ్డు పక్కనే భర్త మృతదేహంతో చాలాసేపు రోదిస్తూ ఉండిపోయింది.

పైడమ్మ రోదనను గుర్తించిన స్థానికులతో పాటు అక్కడి ప్రయాణికులు స్పందించారు. పోలయ్య మృతదేహాన్ని సాలూరు పట్టణానికి తరలించే ఏర్పాటు చేశారు. పోలయ్యకు ఇద్దరు ఆడ పిల్లలు, ఒక కుమారుడు ఉన్నాడు. అందరికీ పెళ్లి చేశాడు. అందరూ ఉండి అనాథగా పోలయ్య మృతి చెందడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Tags

Read MoreRead Less
Next Story