VIZAG: విశాఖకు కొత్త పండుగ

VIZAG: విశాఖకు కొత్త పండుగ
నేటి నుంచి మిలాన్‌-2024.... వివిధ దేశాల నౌకాదళ విన్యాసాలు

విశాఖపట్నానికి పండగ వచ్చేసింది. వివిధ దేశాల నౌకాదళ విన్యాసాలకు నగరం వేదిక కాబోతోంది. నేటి నుంచి మిలాన్‌-2024 జరగనుంది. గగనతలంలో ఫైటర్‌ జెట్స్‌, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు విన్యాసాలతో ఆకట్టుకోనున్నాయి. అమెరికా, రష్యా, ఇరాన్‌, శ్రీలంక, స్పెయిన్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, యూకే , మలేసియా, ఇండోనేషియా సహా 50 దేశాలకు చెందిన నౌకా దళాలు ఇందులో పాలు పంచుకోనున్నాయి. 2020లో జరగాల్సిన 11 వ మిలన్ కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత 2022లో జరిగింది. మళ్లీ ఈసారి కూడా మిలన్ 2024 నిర్వహణ భారత్ చేపట్టింది. ఇందులో పాల్గొనాల్సిందిగా 58 దేశాల నేవీలకు ఆహ్వానం పంపారు. 90శాతం దేశాలు అందుకు సమ్మతిని తెలియజేశాయి. పలు దేశాలు తమ యుద్ద నౌకలను కూడా ఈ విన్యాసాల కోసం పంపుతున్నాయి. తూర్పు నౌకా దళానికి కేంద్రంగా ఉంటూ దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న విశాఖపట్నం మిలాన్‌-2024 వేడుక ద్వారా 9రోజుల పాటు సరికొత్త శోభతో అలరారనుంది.


.భారతదేశానికి చెందిన లుక్‌ఈస్ట్‌ విధానానికి అనుగుణంగా ఇండోనేషియా, సింగపూర్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌ దేశాల భాగస్వామ్యంతో 1995లో ప్రారంభించి ద్వైవార్షిక బహుళ పక్ష నౌకాదళ విన్యాసమే మిలాన్‌. ఈ విన్యాసాలు పదో ఎడిషన్‌ వరకు అండమాన్‌ నికోబార్‌ దీవుల ఆధ్వర్యంలో నిర్వహించారు. వీటి స్థాయి పెరగడం, ఆతిథ్యం ఇచ్చేందుకు మరింత పెద్ద వేదిక అవసరం కావడంతో విశాఖపట్నంను అనువైన ప్రాంతంగా గుర్తించారు. ప్రధాన వాణిజ్య కేంద్రం కావడం, పెద్ద ఓడరేవు, ఏటవాలు తీర ప్రాంతం వల్ల యుద్ధ నౌకలు తీరానికి చేరువగా వచ్చేందుకు అవకాశం ఉండడం వంటి కారణాల వల్ల ప్రాధాన్య వేదికగా ఎంపిక చేశారు. గతంలో 11వ ఎడిషన్‌ విన్యాసాలను 2022లో విశాఖలోనే నిర్వహించారు. మరో సారి మిత్రదేశాలకు నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. దేశ విదేశాలకు చెందిన యుద్ధ విమానాలు, నౌకలు, హెలికాప్టర్లు, జలాంతర్గాములు నగరంలో కనువిందు చేయనున్నాయి.


మిలాన్‌ విన్యాసాలు రెండు దశల్లో జరగనున్నాయి. హార్బర్‌ ఫేజ్‌లో భాగంగా ఈనెల 18 నుంచి 23వరకు వివిధ దేశాల మధ్య సాంస్కృతిక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి, అంతర్జాతీయ మారిటైం సెమినార్‌, సిటీ పరేడ్‌, ఎగ్జిబిషన్‌, తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సీ ఫేజ్‌లో భాగంగా 24 నుంచి 27వరకు భారీ విన్యాసాలు, అధునాతన రక్షణ చర్యలు, యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌, యాంటీ సర్ఫేస్‌ ఆపరేషన్లను నిర్వహించనున్నారు. INS-విక్రాంత్‌, INS-విక్రమాదిత్య సహా భారత నౌకాదళానికి చెందిన 20యుద్ధ నౌకలు, వివిధ దేశాల నౌకా దళాలకు చెందిన యుద్ధ విమానాలు మిలాన్‌-2024లో పాలుపంచుకుంటాయి. 21న సముద్రిక నేవల్‌ ఆడిటోరియంలో ప్రారంభోత్సవం, R.Kబీచ్‌ రోడ్డులో కవాతు నిర్వహిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story