AP: ఏపీలో పట్టు వీడని మున్సిపల్‌ కార్మికులు

AP: ఏపీలో పట్టు వీడని మున్సిపల్‌ కార్మికులు
ఆరో రోజూ ఆందోళనలతో కదం తొక్కిన కార్మికులు... జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు

ఆంధ్రప్రదేశ్‌లో సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ కార్మికులు ఆరో రోజూ కదం తొక్కారు. వినూత్న నిరసనలు, ర్యాలీలతో జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. పలు చోట్ల ప్రైవేటు వ్యక్తులతో చెత్త తొలగింపు చర్యలు చేపట్టిన అధికారులను అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదాలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగన్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఆటంకాలు ఎదురైనా ఆందోళనలు ఆపేది లేదని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికి కార్మికులు వినతిపత్రం అందజేశారు. వినతి పత్రం తీసుకున్న చెన్నకేశవ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్‌ ఎవరికి ఇవ్వాలి ? ఎన్నికలకు ఎక్కడి నుంచి డబ్బు తెచ్చుకోవాలని ఆలోచిస్తుంటే... మీరు సమ్మె చేస్తే ఎలాగంటూ వ్యగ్యాస్త్రాలు సంధించారు.


పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండటంతో ఆళ్లగడ్డ కమిషనర్‌ చీపురు పట్టుకుని వీధులు ఊడ్చేందుకు రంగంలోకి దిగారు. కార్మికులు కమిషనర్‌ను అడ్డుకోవడంతో స్పల్ప వాగ్వాదం జరిగింది. కార్మికులు పట్టువిడవకపోవడం వల్ల... కమిషనర్‌ సిబ్బందితో కలసి వెనుదిరిగారు. ప్రభుత్వం తమను.. నడి రోడ్డుపై నిలబెట్టిందంటూ.... కార్మికులు కడపలో నగర పాలక కార్యాలయం ఎదుట అర్ధనగ్నంగా నిల్చొని ఆందోళన చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రధాన రహదారులపై కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో భారీ ర్యాలీ నిర్వహించారు.


ఒంగోలు సంతపేటలో కార్మికులు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రైవేటు వ్యక్తులతో చెత్త తొలగించేందుకు అధికారులు యత్నించగా కార్మికులు అడ్డుకుని... వాహనాల ఎదుట బైఠాయించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు... వాహనాలను తరలిచేందుకు యత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు కార్మికులను వాహనాల్లో ఎక్కించి స్టేషన్‌కి తరలించారు.


గుంటూరులో మున్సిపల్‌ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు అర్ధనగ్నంగా... మోకాళ్లపై నిల్చుని ఆందోళన చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అధికారులు తీసుకొచ్చిన ప్రైవేటు కూలీలను కార్మికులు అడ్డుకున్నారు. సమ్మె చేసే సమయంలో తమ స్థానాల్లో వేరే వాళ్లని ఎలా తీసుకొస్తారంటూ కార్మికులు నిలదీశారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో N.T.R జిల్లా నందిగామలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. దీంతో ప్రైవేటు వ్యక్తులతో చెత్త సేకరించేందుకు అధికారులు యత్నించారు. దీంతో కార్మికులు శనివారం రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు పురపాలక సంఘం కార్యాలయం ముందు బైఠాయించి.. నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో ఆందోళన చేశారు. పార్వతీపురంలో కార్మికులు అర్ధనగ్నంగా.... పురపాలక కార్యాలయం నుంచి గాంధీ సత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story