జగన్ ప్రభుత్వాన్ని చూసి కాంట్రాక్టర్లు పారిపోతున్నారు: నారా లోకేష్

జగన్ ప్రభుత్వాన్ని చూసి కాంట్రాక్టర్లు పారిపోతున్నారు: నారా లోకేష్
ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు

జగన్‌ దివాలా ప్రభుత్వాన్ని చూసి కాంట్రాక్టర్లు పారిపోతున్నారని టీడీపీ యువనేత నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ఏపీలో రోడ్లపై తట్టమట్టి పోసే దిక్కులేదన్నారు. గత నాలుగేళ్లుగా గ్రామపంచాయితీలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కొన్నిచోట్ల సొంత డబ్బుతో పనులు చేసిన సర్పంచ్‌లు.. ప్రభుత్వం నుంచి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. టీడీపీ పాలనలో గ్రామాల్లో 25 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశామన్న లోకేష్.. గ్రామాల్లో 30 లక్షల ఎల్ఈడి లైట్లు వేశామని చెప్పారు. రైతులకు 3 వేల 500 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తానన్న జగన్ ముఖం చాటేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సీసీ రోడ్లు, లింకు రోడ్లను నిర్మిస్తామని తెలిపారు. పెద్దపసుపుల గ్రామంలో చెరువుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తామన్నారు. రైతులు పండించే ప్రతిపంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన లోకేష్.. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని హామీ ఇచ్చారు.

అంతకుముందు.. ఉమ్మడి కడప జిల్లాలో యువగళం ప్రభంజనం కొనసాగింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా నీరాజనాలు పలికారు. దారిపొడువునా యువనేత నారా లోకేష్‌కు ఉమ్మడి కడప జిల్లా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. జగన్ పాలనలో దగా పడిన అన్ని వర్గాల ప్రజల సమస్యలు వింటూ.. నేనున్నానంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగారు లోకేష్.

110వ రోజు యువగళం పాదయాత్ర 14 వందల 11 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 110వ రోజు ఎన్.కొత్తపల్లి శివారు క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం ఎనిమిదిన్నర గంటలకు పెద్దపసుపుల జంక్షన్‌లో పెద్దముడియం గ్రామస్తులతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత పెద్దపసుపుల చర్చి వద్ద క్రిస్టియన్లతోను, చావిడి వద్ద గ్రామస్తులతో భేటీ అయ్యారు. 11 గంటలకు జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో ముస్లింలతో సమావేశమైన నారా లోకేష్.. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన విడిది కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం పాదయాత్రకు విరామం ఇచ్చి రాజమహేంద్రవరంలో జరగనున్న టీడీపీ మహానాడుకు బయల్దేరి వెళ్లారు. నాలుగు రోజుల విరామం తర్వాత నూటా 11వ రోజు జమ్మలమడుగు బైపాస్ రోడ్డు విడిది కేంద్రం నుంచి తిరిగి యువగళం పాదయాత్ర కొనసాగనుంది.

Tags

Read MoreRead Less
Next Story