Yuvagalam : కృష్ణా తీరంలో అర్ధరాత్రి అపూర్వ ఘట్టం

Yuvagalam : కృష్ణా తీరంలో అర్ధరాత్రి అపూర్వ ఘట్టం
ఒంటి నొప్పులు బాధిస్తున్నా.. కండరాలు పట్టేస్తున్నా.. జనం కోసం కదులుతున్న లోకేష్

కృష్ణా తీరంలో అర్ధరాత్రి అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. యువనేతకు కనీవినీ ఎరుగని రీతిలో జనహారతి పలికారు. 189వ రోజు యువగళం పాదయాత్ర విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమై.. నిడమానూరు వరకు సాగింది. పెద్దసంఖ్యలో జనం బ్రహ్మరథం పట్టారు. పిల్లలు..పెద్దలు.. మహిళలు.. ఇలా అన్ని వర్గాల వారు యువనేత వెన్నంటి ఉన్నారు. నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన పాదయాత్ర.. సోమవారం తెల్లవారుజాము 4 గంటల వరకు.. అంటే 12 గంటల పాటు నిర్వరామంగా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఒంటి నొప్పులు బాధిస్తున్నా.. కండరాలు పట్టేసి అడుగు ముందుకు పడలేని పరిస్థితుల్లోనూ.. అశేషంగా తరలివచ్చిన జనం మధ్య ఓపిక కూడదీసుకుని యువనేత ఉత్సాహంగా నడిచారు. అందర్నీ పలకరిస్తూ.. సమస్యల్ని సావధానంగా వింటూ.. ముందుకు సాగారు.

యువగళం పాదయాత్రకు సంఘీభావంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు, యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. మహిళలు పసిపిల్లలతో సహా వచ్చి లోకేశ్‌ను పలకరించేందుకు పోటీలు పడ్డారు. అడుగడుగునా పూలుచల్లుతూ, యువగళం జెండాలను ప్రదర్శిస్తూ హారతులు ఇస్తూ సంఘీభావం తెలిపారు. పలుచోట్ల ప్రజలు యువనేతకు స్వచ్ఛందంగా గజమాలలను ఏర్పాటు చేశారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో షెడ్యూల్ కంటే 8గంటలు ఆలస్యంగా పాదయాత్ర సాగింది.

పాదయాత్ర పొడవునా యువనేతతో కరచాలనం చేసేందుకు చాలామంది పోటీలు పడ్డారు. వారందరితో చేతులు కలుపుతూ, ఫొటోలు దిగుతూ లోకేశ్‌ ముందుకుసాగారు. దీంతో ఆయన చేతులు గోళ్ల గాట్లతో ఎర్రగా మారిపోయాయి. హైస్కూల్‌ రోడ్డులో గోళ్ల గాట్లను నీటితో శుభ్రపర్చుకుని యాంటీసెప్టిక్‌ పౌడర్‌ అద్దుకుని ముందుకు సాగారు.

అర్ధరాత్రి దాటాక కూడా పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు వేచి ఉండటంతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ లోకేష్‌ ముందుకు సాగారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల వరకు నిద్ర పక్కనపెట్టి జనం లోకేష్‌ వెంటే నడిచారు. సుమారు 12గంటలు 16 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్విరామంగా సాగింది. నిడమానూరు వద్ద లోకేశ్‌ రాత్రి బస చేశారు.

Tags

Read MoreRead Less
Next Story