ఏపీని వణికిస్తోన్న నివర్ తుపాన్.. కన్నీటిపర్యంతమవుతున్న రైతులు

ఏపీని వణికిస్తోన్న నివర్ తుపాన్.. కన్నీటిపర్యంతమవుతున్న రైతులు

తమిళనాడు, పుదచ్చేరితోపాటు ఏపీలోని పలు ప్రాంతాలపై నివర్‌ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. కృష్ణ జిల్లాలో తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలుల ప్రభావంతో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నీటిపాలు అవ్వడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మరోవైపు హంసలదీవి వద్ద సముద్రం 20 మీటర్లు ముందుకు చొచ్చుకొంది. దీంతో మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాపైనా తుపాన్ ప్రభావం పడింది. ముమ్మిడివరం నియోజవర్గంలోని అన్ని గ్రామాలు వర్షం ధాటికి వణికిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. మరోవైపు భారీ వర్షాల వల్ల ఆక్వా చెరువులు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆక్వా రైతులు ఆవేదనచెందుతున్నారు.

నెల్లూరు జిల్లా తిప్పవారిపాడు వద్ద ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుంది. బస్సులో సుమారుగా 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రాణాలు రక్షించుకునేందుకు ఇద్దరు ప్రయాణికులు బస్సు దిగడంతో వరదలో గల్లంతయ్యారు. దీంతో అధికారులు బస్సులో ఉన్న ప్రయాణికులను రక్షించారు. ఇక గుడూరు వద్ద కైవల్య నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నెల్లూరు- చెన్నై మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ప్రకాశం జిల్లాలోనూ తుపాన్ ప్రభావం పడింది. తుపాను పరిస్థితులను అంచనావేయడానికి జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ కొత్తపట్నం తీర ప్రాంతంలో పర్యటించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. భారీ వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీటమునిగాయని ఎస్పీ తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామన్నారు.

కడప నగరంలో వరదనీరు బీభత్సం సృష్టిస్తోంది. బుగ్గవంక వరద కాలనీల్లోకి చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. గంటగంటకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు.

అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో తుపాన్ తీవ్ర ప్రభావం చూపించింది. గాండ్లపెంట మండలం సోమలగొంది క్రాస్ వద్ద కదిరి- రాయచోటి రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో చుట్టుపక్కల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు.

మొత్తానికి నివర్ తుపాన్ ఏపీని షివర్ చేస్తుంది. తీరం దాటిపోయినా మరో 24 గంటలపాటు తుపాన్ ప్రభావం ఉండనుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story