ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు

ఏపీ సీఎం జగన్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. జగన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ పిటిషన్ వేశారు..

సీఎం జగన్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు
X

ఏపీ సీఎం జగన్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. జగన్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ పిటిషన్ వేశారు. సీజేఐకి రాసిన లేఖలోని అంశాలను ప్రెస్‌ మీట్‌లో వెల్లడించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జస్టిస్‌ ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ లేఖను విడుదల చేయడాన్ని తప్పుపడుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీఎం జగన్‌పై దాదాపు 30 క్రిమినల్‌ కేసులున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. మనీలాండరింగ్ కేసు కూడా నమోదైందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

మరోవైపు సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తికి జగన్‌ రాసిన లేఖను ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్ తీవ్రంగా తప్పుపట్టింది. జగన్ చేసిన ప్రయత్నాలు కోర్టులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ వ్యవహారం న్యాయ వ్యవస్థ, చట్ట సమితికి సంబంధించినది కావడంతో ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ దీనిపై చర్చించింది.. భారత రాజ్యాంగం అప్పగించిన బాధ్యతను న్యాయ వ్యవస్థ అత్యంత అంకితభావంతో నిర్వహిస్తోందని వెల్లడించింది. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందనున్న జస్టిస్ ఎన్వీ రమణ అత్యంత సమర్థమైన, నిజాయితీ గల న్యాయమూర్తుల్లో ఒకరని పేర్కొంది.

ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల తీర్పులకు ఉద్దేశాలు ఆపాదిస్తూ.. జగన్ రాసిన లేఖ పాలనా వ్యవహారాల్లో అవాంఛనీయ జోక్యంగా పరిగణిస్తున్నామని బార్‌ అసోసియేషన్ స్పష్టం చేసింది. లేఖలోని ఆరోపణలు ఎలాంటి ఆధారాలు లేకుండా అత్యున్నత న్యాయస్థానాల్లోని.. న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించేవిగా ఉన్నాయని తెలిపింది. ఇది కోర్టుల స్వతంత్రతను దెబ్బతీయడమే కాకుండా.. కోర్టు ధిక్కారంగా పరిగణించ దగినవని ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్ అభిప్రాయపడింది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసింది. అటు సీజేఐకి జగన్‌ రాసిన లేఖను సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌రికార్డు అసోసియేషన్ ఖండించింది. లేఖలోని అంశాలను ప్రెస్‌మీట్‌లో వెల్లడించడం అవాంఛనీయ పరిణామంగా పేర్కొంది. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే విధంగా ఉందని.. సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌రికార్డు అసోసియేషన్ స్పష్టం చేసింది.

Next Story

RELATED STORIES