ఆంధ్రప్రదేశ్

ఏపీ సర్కారుకు షాకిచ్చిన కేంద్రం

ఏపీ సర్కారుకు షాకిచ్చిన కేంద్రం
X

ఏపీ సర్కారుకు కేంద్రం షాకిచ్చింది. జాతీయ ప్రాజెక్ట్‌ హోదా పొందిన పోలవరంపై కేంద్రం కుండబద్దలు కొట్టింది. పాత అంచనాలే ఫైనల్‌ అని తేల్చేసింది. 2013 భూసేకరణ చట్టంతో పునరావాస వ్యయం భారీగా పెరిగినా పట్టించుకునేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. పాత అంచనా వ్యయం 20 వేల 398 కోట్ల రూపాయలు అంగీకరించాలని, లేని పక్షంలో రాష్ట్రానికి రీయింబర్స్‌ చేయాల్సిన 2వేల 232 కోట్లు కూడా ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌ ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక మంత్రిని కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులు, పోలవరం ప్రాజెక్ట్‌కు రావాల్సిన నిధులు త్వరగా ఇవ్వాలని కోరారు. అయితే...పోలవరం అథారిటీ గతంలో పంపిన 55 వేల కోట్ల డీపీఆర్‌ను కాదని, కేంద్ర జల సంఘం ఇటీవల ప్రాజెక్ట్‌ అంచనా వ్యవయాన్ని 20 వేలు కోట్లగా తేలుస్తూ డీపీఆర్‌ 2 ను ప్రతిపాదించింది. దాన్ని పోలవరం అథారిటీకీ ఆమోదిస్తేనే.. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై ఖర్చిపెట్టిన 2, 234 కోట్లు బకాయిలైనా వస్తాయని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

అయితే... బుగ్గన రాజేంద్రనాథ్‌ మాత్రం స్పష్టం ఇవ్వడం లేదు. కేంద్రమంత్రిని నిధులుగా మాత్రమే అడిగామంటున్నారు. సీఎంతో మాట్లాడక తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతే తప్ప కేంద్ర ఆర్ధిక మంత్రి నుంచి సానుకూల సంకేతాలు ఉన్నట్లు చెప్పలేదు. పైగా చంద్రబాబు ప్రభుత్వంపై నెపం మోపే ప్రయత్నం చేశారు. అంచనాలను 55 వేల 548 కోట్లకు సవరించి కేంద్ర జలసంఘానికి, జలశక్తి శాఖకు పంపింది టీడీపీ ప్రభుత్వం కాగా.. తామే సవరించి పంపించినట్లు చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం తుది అంచనాల ప్రకారం 55 వేల 548 కోట్లు అని.. దీనిని ఆమోదించి నిధులివ్వాలని గతంలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ అంచనాలపై అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అంచనాలు పెంచొద్దని కేంద్రానికి లేఖలు కూడా రాసింది వైసీపీ. అయితే... గత ఏడాది ఎన్నికల ముందే 55 వేల 548 కోట్ల సవరించిన అంచనాలను కేంద్ర జలసంఘం పరిధిలోని సాంకేతిక సలహా మండలి ఆమోదించింది. తర్వాత ఈ ఫైలును కేంద్ర జలశక్తి శాఖ కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. సవరించిన అంచనాలను పట్టించుకోని ఆర్థిక శాఖ.. 2013-14 అంచనాల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం 20 వేల 398కోట్లేనని.. ఆ మేరకు రాష్ట్రప్రభుత్వాన్ని ఒప్పించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కి లేఖ రాసింది. ఈ పాత అంచనా వ్యయం అంగీకరించాలని, లేని పక్షంలో రాష్ట్రానికి రీయింబర్స్‌ చేయాల్సిన 2వేల 232 కోట్లు కూడా ఇచ్చేది లేదని చెప్పినట్లు తెలుస్తోంది.

పోలవరం విషయంలో కేంద్రం వైఖరి, తాజాపరిణామాలపై సీఎం జగన్‌ శనివారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో.. ఆర్ధిక , జలవనరులుశాఖ అధికారులతో సమావేశమై చర్చలు జరపనున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏం చేయాలనేది ఈ భేటీలో నిర్ణయిస్తారని తెలుస్తోంది. సీఎంవో నుంచి పోలవరం అధికారులను కొంత సమాచారం కోరడంతో.. పాత రికార్డులు అన్నీ సరిచూస్తూ.. అధికారులు నివేదికలు తయారు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES