పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై రౌండ్ టేబుల్ సమావేశం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై రౌండ్ టేబుల్ సమావేశం

ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం జీవనాడి. 150 అడుగుల ఎత్తు ఉండే ఈ ప్రాజెక్టులో 194 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చు. ఇది పూర్తి అయితే 7 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు, 960 మెగావాట్ల జలవిద్యుత్, 540 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరు అందించే అవకాశం ఉంది. 24 టీఎంసీ లతో విశాఖకు మంచినీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు సమృద్ధిగా అందే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కృష్ణా, గోదావరి డెల్టాలో 23 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు స్థిరీకరణ చేయడం జరుగుతుంది. అలాగే 80 టీఎంసీల నీరు కృష్ణా నదిలోకి అందించడం ద్వారా శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నికర జలాల సరఫరాకు వీలు కలుగుతుంది.

ఇలాంటి భారీ ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై అఖిలపక్ష సమావేశంలో నేతలు కూలంకషంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఈ ప్రాజెక్ట్ కు అవసరం అయిన నిధుల విషయంలో కేంద్రప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కేసులు మాఫీ చేయించుకోవడానికి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు తప్పితే పోలవరం ప్రాజెక్టుకు నిధుల కోసం కాదని మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టులో 72 శాతం పనులు పూర్తి అయ్యాయని.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క శాతం పనులు కూడా ముందుకు వెళ్లలేదని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే తాగు, సాగు నీటి అవసరాలతో పాటు జల విద్యుత్, జలరవాణాకి కూడా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో జగన్.. కేంద్రప్రభుత్వానికి లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు.

ఇక ఈ సమావేశంలో రైతులు, రైతు సంఘం నాయకులు సైతం పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే ఆంధ్రప్రదేశ్ రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని రైతు సంఘం నేత ,మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వర్ అన్నారు.

దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కొన్ని కీలకమైన తీర్మానాలు చేశారు.


Tags

Read MoreRead Less
Next Story