ఎస్వీబీసీ మెయిల్‌లో పోర్న్‌ వీడియో లింక్ పంపిన ఉద్యోగిని తొలగించిన టీటీడీ

ఎస్వీబీసీ మెయిల్‌లో పోర్న్‌ వీడియో లింక్ పంపిన ఉద్యోగిని తొలగించిన టీటీడీ

ఎస్వీబీసీ మెయిల్‌లో పోర్న్‌ సైట్‌ లింక్‌ ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. పుట్టినరోజునాడు వేదమంత్రాలతో ఆశీర్వదించే ఉద్దేశంతో శతమానంభవతి కార్యక్రమం రూపొందించింది ఎస్వీబీసీ. ఆ ప్రోగ్రామ్ కోసం ఓ భక్తుడు మెయిల్ చేశాడు. థ్యాంక్యూ అనో, మెయిల్ అందిందనో రిప్లై ఇవ్వాల్సిన సిబ్బంది... తాము చూస్తున్న పోర్న్‌ వీడియోల లింక్ పంపించారు. ఆ భక్తుడు టీటీడీ ఛైర్మన్, ఈవోకి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్... ఎస్వీబీసీ ఆఫీసులోనే నీలి చిత్రాలు చూస్తున్న పలువురు ఉద్యోగులను గుర్తించింది. పోర్న్‌ వీడియో లింక్ పంపిన ఉద్యోగిని టీటీడీ తొలగించింది. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా మరో నలురుగిపై చర్యలకు సిద్ధమైంది.

తిరుమలకు వెళ్లకుండానే... ఇంట్లో నుంచే స్వామికి జరిగే నిత్యకైంకర్యాలు చూసేందుకు భక్తులు ఎస్వీబీసీని మాధ్యమంగా భావిస్తారు. ఆనంద నిలయంలో స్వామికి జరిగే పూజాధికాలు మొదలుకొని.. బ్రహ్మోత్సవాల్ని వీక్షించి... తరిస్తారు. వేంకటాద్రిని చూపిస్తున్న ఛానెల్‌ను పవిత్రంగా భావిస్తారు. తిరుమలకు స్వయంగా వెళ్లి చూడలేని వాళ్లు... టీవీలోనే దండం పెట్టుకుంటారు. అలాంటి ఛానెల్‌లో గౌరవప్రదమైన హోదాలో ఉన్న విషయం మరిచిన పలువురు సిబ్బంది... ఆఫీసులోనే పోర్న్‌ వీడియోలు చూడటానికి అలవాటు పడ్డారు.

ఎస్వీబీసీ ఛానల్‌లో పోర్న్‌ వీడియోలు చూస్తున్న ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

ఎస్వీబీసీలో అక్రమ నియామకాలు జరిగాయని టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు భానుప్రకాశ్‌ రెడ్డి ఆరోపించారు. ఛానల్‌ను వెంటనే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.

ఎస్వీబీసీ ఆఫీసులో పోర్న్ వీడియోలు చూస్తున్న అందరినీ తొలగించాలని బీజేపీ నేత రమేశ్ నాయుడు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించాలని అన్నారు. ఆధ్యాత్మిక చింతన ఉండాల్సిన చోట నీలిచిత్రాలు చూడడమేంటని మండిపడుతూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. సిబ్బంది.. అశ్లీల చిత్రాలు వీక్షిస్తుంటే.. అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story