AP: కరెంట్ కోతలతో ఉక్కిరిబిక్కిరైతున్న ప్రజలు

AP: కరెంట్ కోతలతో ఉక్కిరిబిక్కిరైతున్న ప్రజలు
ఓ వైపు పెరిగిన ఉష్ణోగ్రతలు మరోవైపు కరెంట్ కోతలతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

ఏపీలో కరెంట్ కట్ లతో జనం విలవిలలాడుతున్నారు. ఓ వైపు పెరిగిన ఉష్ణోగ్రతలు మరోవైపు కరెంట్ కోతలతో ఏపీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్న జగన్ సర్కారు మాటలు నీటముటల్లానే మారాయి. కొన్నిరోజులుగా వేళాపాళా లేకుండా విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఇంట్లో ఉక్కపోత.. బయటకు వెళ్లాలంటే వడగాడ్పుల భయం. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్‌ తిరగకుండా ఇంట్లో ఉండటం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు జనం. రాత్రి వేళల్లో కరెంటు పోవడంతో చిన్న పిల్లలు, వృద్ధులు నిద్ర లేక ఒత్తిడికి గురవుతున్నారు. కోతలు అమలు చేస్తున్నట్లు డిస్కంలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. అయినా కోతలు సర్వసాధారణమయ్యాయి. దీనికి సాంకేతిక సమస్యలే అంటూ కారణాలు చెబుతున్నారు విద్యుత్ అధికారులు. డిమాండుకు అనుగుణంగా విద్యుత్‌ను సమకూర్చుకోవడంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికి అనధికారిక కోతలకు ‘సాంకేతిక సమస్య’ ముద్ర వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ విపరీతంగా ఉంటుంది. దీనికి అనుగుణంగా సర్కారు కరెంట్ ను సమకూర్చుకోవాలి. కానీ డిమాండు కంటే 1.61 ఎంయూలు తక్కువ సరఫరా ఉన్నట్లు దక్షిణ ప్రాంతీయ లోడ్‌డిస్పాచ్‌ సెంటర్‌ స్పష్టం చేసింది. అధికారికంగా చూపుతున్న మొత్తం కంటే 2, 3 రెట్లు అధికంగా విద్యుత్‌లోటు ఉంటుంది. 5-6 ఎంయూల విద్యుత్‌ను సర్దుబాటు చేయడానికి గ్రామాల్లో ఎడాపెడా కోతలు విధించారు. కొన్ని పట్టణాల్లోనూ రెండు రోజులకోసారి కోతలు తప్పట్లేదు. రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ 245.11 మిలియన్‌ యూనిట్లు గా నమోదైంది. ఆ మేరకు విద్యుత్‌ను సర్దుబాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది. బహిరంగ మార్కెట్‌ నుంచి 44.5 ఎంయూల విద్యుత్‌ను డిస్కంలు కొన్నాయి. అయినా 1.61 ఎంయూల కొరత ఏర్పడింది. 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉన్న దక్షిణగ్రిడ్‌లో విద్యుత్‌ కొరత 2.04 ఎంయూలు ఉన్నట్లుగా చూపితే.. అందులో మన రాష్ట్రానికే 1.61 ఎంయూలు ఉండటం గమనార్హం. మొత్తానికి కరెంట్ కోతలతో ఏపీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story