AP: ప్రజా గళం సభకు ముమ్మర ఏర్పాట్లు

AP: ప్రజా గళం సభకు ముమ్మర ఏర్పాట్లు
టీడీపీ-జనసేన-బీజేపీ సభకు ప్రజా గళం పేరు ఖరారు... లోకేశ్‌ నేతృత్వంలో ముమ్మర ఏర్పాట్లు

తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంయుక్తంగా ఒకే వేదికపై ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి బహిరంగసభ వేదిక కానుంది. రేపు జరిగే బహిరంగ సభకు ప్రజాగళం పేరు ఖరారు చేశారు. లోకేష్ నేతృత్వంలో 13 కమిటీల సభ్యులు నిర్విరామంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభకు ప్రధాని నరేంద్రమోదీ వస్తున్నందున బ్లూ బుక్ భద్రత నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. బొప్పూడి సభ ద్వారా ఏపీ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ మోదీ, చంద్రబాబు, పవన్ రూట్ మ్యాప్ ప్రకటించే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి మొదటి బహిరంగ సభ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖరారైన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న బహిరంగసభకు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.


చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద 300 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో 225 ఎకరాలు వాహనాల పార్కింగ్, హెలిప్యాడ్‌లకు కేటాయించారు. 75 ఎకరాల విస్తీర్ణంలో సభావేదిక, వీఐపీ, ప్రజలకు వేర్వేరుగా బారికేడ్లతో గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. 8 అడుగుల ఎత్తులో ప్రధాన వేదిక నిర్మించారు. దాని వెనుక వైపు అత్యంత ప్రముఖుల కోసం గ్రీన్‌రూమ్‌లు ఏర్పాటుచేశారు. ప్రధాన వేదిక వరకు పైన జర్మన్‌ టెంటు వేశారు. ఈ సభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతున్నందున గురువారం నుంచే సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ ఆధీనంలోకి తీసుకుంది. ఏర్పాట్లను పరిశీలించడంతోపాటు పూర్తిస్థాయిలో ఎస్పీజీ తనిఖీలు నిర్వహిస్తున్నారు.


ప్రధాని మోదీతోపాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కళ్యాణ్‌ హాజరవుతున్నందున 7 హెలిప్యాడ్‌లు నిర్మిస్తున్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు జనసేన, బీజేపీ నేతలు అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. గురువారం నుంచే పోలీసులు సభాప్రాంగణంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. బొప్పూడి సభ ద్వారా కూటమి ఎన్నికల ప్రణాళికను ప్రజలకు పరిచయం చేయనున్నారు. మోదీ వస్తున్న దృష్ట్యా.. ఆయన ఏపీకి ఏమైనా ప్రత్యేక హామీలు ఇస్తారని భావిస్తున్నారు. మూడు పార్టీల రాష్ట్ర నేతలు ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీజీ సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుని పనులు నిర్వహిస్తున్నారు.

సభా వేదిక ఎంపికలో కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి పక్కనే సభ ఏర్పాటుచేశారు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలకు ఇబ్బంది లేకుండా నేరుగా చేరుకునే వెసులుబాటు ఉంది. వేల సంఖ్యలో వాహనాల్లో జనం వచ్చినా ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించవచ్చు. ఈ సభ కోసం ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు అంగీకరించింది. ఆర్టీసీ వెసులుబాటును బట్టి ఎన్ని బస్సులు కేటాయిస్తే అన్ని బస్సులు తీసుకుంటామని టీడీపీ నేతలు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story