ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా యువకుడి మృతి కేసులో మరో మలుపు

రాజశేఖర్‌రెడ్డి ఆత్మహత్యతో ఇప్పుడు వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి.

కృష్ణా జిల్లా యువకుడి మృతి కేసులో మరో మలుపు
X

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం రాత్రి సూసైడ్ చేసుకుని చనిపోయిన రాజశేఖర్‌రెడ్డి మృతదేహం ఇప్పుడు గ్రామానికి చేరుకోవడంతో జాతీయ రహదారిపైనే కుటుంబసభ్యులు బైఠాయించారు. వీరికి మద్దతుగా మరికొందరు గ్రామస్థులు కూడా ఆందోళనకు దిగారు. తమకు న్యాయం కావాలంటూ యువకులంతా నినాదాలు చేస్తున్నారు. ఈ ధర్నా కారణంగా జాతీయ రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.

రాజశేఖర్‌రెడ్డి ఆత్మహత్యతో ఇప్పుడు వైసీపీలో విభేదాలు బయటపడ్డాయి.పార్టీ మద్దతుదారు సూసైడ్ విషయంలో మైలవరం ఎమ్మెల్యే అనుచరులు ఒక వర్గంగా, నందిగామ ఎమ్మెల్యే వర్గీయులు ఒక వర్గంగా విడిపోయారు. రాజశేఖర్‌రెడ్డి సూసైడ్‌కి మార్తా శ్రీను కారకుడు అంటూ జాతీయ రహదారిపై మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ వర్గం బైఠాయించింది. మార్తా శ్రీనుపై చర్యలు తీసుకోవాలనేది కేపీ వర్గం డిమాండ్. ఐతే.. మార్తా శ్రీనుకు నందిగామ ఎమ్మెల్యే జనన్మోహన్‌రావు వర్గం అండగా నిలుస్తోంది. దీంతో.. ఈ వివాదం ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల మద్దతుదార్ల మధ్య చిచ్చు పెట్టినట్టు అయ్యింది. రాజశేఖర్ మృతిపై పూర్తి విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందేనని మైలవరం ఎమ్మెల్యే కేపీ వర్గం కోరుతోంది. ప్రస్తుతం కంచికచర్ల మండలంలోని పరిటాలలో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన మున్నంగి రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు 2 రోజుల క్రితం ఓ కేసులో అరెస్టయ్యాడు. వైసీపీ సానుభూతిపరుడైన అతన్ని విడిపించేందుకు ఆ పార్టీ నేతలెవరు ముందుకు రాలేదు. దీంతో టీడీపీకి చెందిన కోగంటి బాబు వెళ్లి రాజశేఖర్‌ను విడిపించారు. దీనికి కృతజ్ఞతగా కోగంటిబాబును పొగుడుతూ రాజశేఖర్‌ వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టాడు. ఆ తర్వాత ఈ ఘటన రెండు పార్టీల మధ్య వివాదంగా మారింది. ఇదే టైమ్‌లోనే రాజశేఖర్‌ సహా పేకాట కేసులో పట్టుబడిన వారందరినీ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత స్టేషన్‌ నుంచి వెళ్లిన రాజశేఖర్‌ మనస్థాపంతో కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేత మార్తా శ్రీను అనే వ్యక్తి కావాలనే రాజశేఖర్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో శనివారం ఉదయం నుంచి స్థానికంగా ఉద్రిక్తత రగులుతూనే ఉంది. ఇప్పుడు మృతదేహం ఊళ్లోకి తీసుకురావడంతో బంధువులంతా రోడ్డుపైనే బైఠాయించారు.

ఓ పక్క ఈ వివాదం కొనసాగుతుండగానే కేసు మరో మలుపు తిరిగింది. మేనల్లుడు మృతితో మనస్తాపానికి గురైన రాజశేఖర్ మేనత్త సరస్వతి.... శానిటైజర్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో ఆమెను కంచికచర్లలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కొట్టడం వల్లే తన మేనల్లుడు మనస్తాపానికి గురై కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రాజశేఖర్ మరణంతో ప్రస్తుతం గ్రామంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఒక్కసారిగా అలజడికి కారణం అయ్యాయి.

Next Story

RELATED STORIES