AP: జగన్‌ పాలనలో స్థానిక సంస్థల నిర్వీర్యం

AP: జగన్‌ పాలనలో స్థానిక సంస్థల నిర్వీర్యం
జన చైతన్య వేదిక నేతృత్వంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం... ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డ నేతలు

వైసీపీ ప్రభుత్వం సచివాలయ, వాలంటరీ వ్యవస్థల్ని సమాంతరంగా ఏర్పాటు చేసి స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసిందని రాజమండ్రిలో జనచైతన్య వేదిక నిర్వహించిన స్థానిక ప్రభుత్వాల సాధికారిత రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. పంచాయతీల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా, కేంద్ర నిధులు మళ్లించి తీవ్రమైన అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో జరిగిన స్థానిక ప్రభుత్వాల సాధికారత రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సర్పంచ్‌లకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై గళం విప్పారు.ప్రజాస్వామ్యంలో గ్రామ స్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలను స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించినప్పటికీ ఏపీలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని జనచైతన్య వేదిక ఏపీ అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్షణరెడ్డి అన్నారు. సచివాలయానికి వెళ్తే కూర్చునేందుకు కుర్చీ లేని పరిస్థితి తెచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు.


వైసీపీ అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వలేదని సీఎం జగన్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వైసీపీ సర్పంచ్, సర్పంచ్‌ల సంక్షేమ సంఘం ఏపీ అధ్యక్షుడు పాపారావు అన్నారు. 13 వేల మంది సర్పంచ్ లు తలచుకుంటే వైసీపీకి 20 లక్షల మందికి ఓటు వేయకుండా చేయవచ్చని సర్పంచ్ ల సంఘం ఏపీ అధ్యక్షుడు నరేంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ పాలనలో గ్రామ స్వరాజ్యం అన్న భావనకు అర్థం లేకుండా పోయిందని ప్రముఖ్య న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. పలు పార్టీల నాయకులు ప్రభుత్వ తీరును తీ‌వ్రంగా తప్పుబట్టారు.

గ్రామాలు, పట్టణాల్లో పంచాయతీలకు సమాంతరంగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి స్థానిక ప్రభుత్వాలను నాశనం చేస్తున్నారని.. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రికి బదులు గవర్నర్‌తో పాలన చేయించాలని కేంద్రం నిర్ణయిస్తే అంగీకరిస్తారా అని ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నాయకుడు ఎన్‌.తులసిరెడ్డి ప్రశ్నించారు. గ్రామస్వరాజ్య సాధనకు అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సేవ చేయాలనే తపనతో గెలిచిన సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మిగిలే పరిస్థితి నెలకొందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ఎందుకు కావాలనే రాజకీయ కార్యక్రమానికి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది భాగస్వామ్యం చేయడంపై విమర్శించారు. స్థానిక ప్రభుత్వాలను నిర్వీర్యం చేసి ముఖ్యమంత్రి జగన్‌ నియంత పాలన సాగిస్తున్నారని.. పౌరహక్కుల సంఘం ఏపీ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు విమర్శించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం విడుదల చేస్తున్న ఆర్థిక సంఘం నిధులు మళ్లిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సచివాలయ, వాలంటీరు వ్యవస్థలను పంచాయతీలకు అనుసంధానం చేసి సర్పంచుల ఆధ్వర్యంలో పనిచేసేలా చేయాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story