ఏపీ తెలంగాణ మధ్య ఆర్టీసి సర్వీసులు పునఃప్రారంభం

ఏపీ తెలంగాణ మధ్య ఆర్టీసి సర్వీసులు పునఃప్రారంభం
కరోనా మహమ్మారి విజృంభించిన సందర్భంగా ఏపీ తెలంగాణ మధ్య నిలిచిపోయిన ఆర్టీసి సర్వీసులు పునఃప్రారంభం అయ్యాయి. దీనిపై పలు మార్లు చర్చించిన అధికారులు..

కరోనా మహమ్మారి విజృంభించిన సందర్భంగా ఏపీ తెలంగాణ మధ్య నిలిచిపోయిన ఆర్టీసి సర్వీసులు పునఃప్రారంభం అయ్యాయి. దీనిపై పలు మార్లు చర్చించిన అధికారులు అంతరాష్ట్ర సర్వీసులను నడిపించేందుకు అవగాహనకు వచ్చారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఏపీలో లక్షా 61వేల 258 కిలో మీటర్ల మేర టీఎస్‌ ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. ఇక తెలంగాణలో లక్షా 60వేల 999 కిలో మీటర్ల మేర 638 బస్సులను ఏపీఎస్‌ ఆర్టీసీ నడపనుంది.

ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసుల సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసులు....ఏయే మార్గాల్లో ఎన్ని సర్వీసులు నడపాలో అనేదానిపై ఓ నిర్ణయానికివచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఇరురాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు ఒప్పందంపై సంతకాలు చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాలు లక్ష కిలోమీటర్లు సర్వీసులు నడపాలంటే కష్టమే అని ఏపీ ఆర్టీసీ ఎండి కృష్ణబాబు అన్నారు. కరోనా పరిస్థితులు చక్కబడి సాధారణ స్థితికి రావడానికి మరో ఆరు నెలల సమయం పట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి సమయం తీసుకున్నా ... సమగ్రమైన అవగాహనతో ఒప్పందం కుదిరిందన్నారు తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్. ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం వల్ల ఏపీఎస్ ఆర్టీసీకి లాభం చేకూరుస్తుందన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీ , తెలంగాణ మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయని మంత్రి అజయ్ అన్నారు. సోమవారం రాత్రి నుంచే రెండు రాష్ట్రాల మధ్య సర్వీసులు నడుస్తాయని మంత్రివెల్లడించారు. టీఎస్ ఆర్టీసీకి ఛార్జీలు పెంచే ఆలోచన లేదని మంత్రి అజయ్ స్పష్టం చేశారు. ఆర్టీసీల మధ్య చర్చలు ఆలస్యం అవ్వడం వల్ల... ప్రైవేట్ ట్రావెల్స్‌కు లాభం చేకూరుతుందనే మాట వాస్తవం కాదని మంత్రి వెల్లడించారు.

గత కొన్ని నెలలుగా అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసి సర్వీసుల వ్యవహారం కొలిక్కిరావడంతో ప్రయాణీకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇన్నాళ్లు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోయామని అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story