AP: దస్తగిరికి భద్రత పెంపు

AP: దస్తగిరికి భద్రత పెంపు
పులివెందులలో రేపు దస్తగిరి నామినేషన్‌... టెన్‌ ప్లస్‌ టెన్‌ భద్రత ఏర్పాటు

వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరికి భద్రత పెంచారు. పులివెందుల అసెంబ్లీ స్థానానికి రేపు దస్తగిరి నామినేషన్ వేయబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా పులివెందులలో నేరుగా నామినేషన్ సమర్పించనున్నారు. ఈ తరుణంలో దస్తగిరికి ఇవాళ, రేపు భద్రత పెంచారు. టెన్ ప్లస్ టెన్ భద్రత ఏర్పాటు చేశారు. మొదట ఇవాళ నామినేషన్ వేయాలని దస్తగిరి ముందుగా నిర్ణయించుకున్నారు. టీడీపీ అభ్యర్ధి బీటెక్ రవి కూడా ఇవ్వాలే నామినేషన్ వేస్తున్నారు. ఈ సందర్భంగా బీటెక్ రవి నిర్వహించే ర్యాలీలోకి వైసీపీ కార్యకర్తలు ప్రవేశించి... తనపై రాళ్ల దాడి చేయాలని కుట్ర పన్నినట్లు సమాచారం అందిందని దస్తగిరి చెబుతున్నారు. అందుకే తన నామినేషన్ దాఖలు కార్యక్రమాన్ని రేపటికి మార్చుకున్నట్లు తెలిపారు. జగన్ నామినేషన్ వేసినప్పుడే తాను కూడా వేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. దేనికి భయపడబోనని దీటుగా ఎదుర్కొంటానని దస్తగిరి తెలిపారు.

వివేకా హత్య కేసు వెనుక ఎవరు ఉన్నారో, చంపించింది ఎవరో ప్రజలందరికీ తెలుసని వివేకా కేసు అప్రూవర్ దస్తగిరి అన్నారు. జగన్​, అతని భార్య భారతి హస్తం ఉందనే కేసు విచారణ ముందుకు వెళ్లటం లేదని దస్తగిరి ఆరోపించారు. భారతి సూచన లేనిదే జగన్ ఈ సాహసం చేసే అవకాశం లేదని దస్తగిరి వెల్లడించారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మరిన్ని కీలక విషయాలు బయటపెట్టారు.

ఈ హత్యలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితోపాటు సీఎం జగన్‌, ఆయన భార్య భారతి హస్తం ఉందని అందుకే కేసు విచారణ ముందుకు సాగడం లేదని దస్తగిరి ఆరోపించారు. ఈ విషయం వైఎస్సార్‌ జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. వివేకా హత్యకు ముందు నన్ను భాస్కర్‌రెడ్డి ఇంటికి తీసుకెళ్లగా అక్కడ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఉన్నారని దస్తగిరి తెలిపారు. వాళ్లు చెప్పినట్లు చేయాలని కోరడంతో నేను వెనక్కి తగ్గడంతో వెంటనే అవినాష్‌రెడ్డి ఫోన్‌ ద్వారా జగన్‌ నాతో మాట్లాడారని అతను పేర్కొన్నారు. 'దస్తగిరీ మావాళ్లు ఏం చెబితే అది చేయ్​, ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా' అని జగన్​ చెప్పడంతో ధైర్యంగా రంగంలోకి దిగానని దస్తగిరి తెలిపారు. భారతి సూచన లేనిదే జగన్‌ ఈ సాహసానికి పాల్పడే అవకాశం లేదని దస్తగిరి వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story