వెండి సింహాలు మాయంపై ఈవో పొంతన లేని సమాధానాలు

వెండి సింహాలు మాయంపై ఈవో  పొంతన లేని సమాధానాలు
బెజవాడ దుర్గమ్మను తెలుగువారంతా ఇలవేల్పుగా కొలుస్తారు.. అమ్మవారికి నిర్వమించే ప్రతి ఉత్సవం, వేడుకా భక్తుల మనోభావాలకు కేంద్ర బిందువై ఉంటుంది.. అటువంటిదే అమ్మవారికి చెందిన..

బెజవాడ దుర్గమ్మను తెలుగువారంతా ఇలవేల్పుగా కొలుస్తారు.. అమ్మవారికి నిర్వమించే ప్రతి ఉత్సవం, వేడుకా భక్తుల మనోభావాలకు కేంద్ర బిందువై ఉంటుంది.. అటువంటిదే అమ్మవారికి చెందిన రథం.. ఏడాదిలో రెండుసార్లు మాత్రమే ఈ రథాన్ని అధికారులు బయటకు తీస్తారు.. ఉత్సవాలకు వినియోగిస్తారు.. ఆ తర్వాత దీనిని జాగ్రత్తగా భద్రపరుస్తారు. అయితే, ఈ రథానికి సంబంధించిన వెండి సింహాలు మాయం కావడం ఏపీలో కలకలం రేపుతోంది.. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది అర్థం కాకుండా ఉంది.. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన తర్వాత పోలీసు ఉన్నతాధికారులు ఆలయాల్లో భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.. ఈ నేపథ్యంలోనే దుర్గమ్మ ఆలయంపైనా దృష్టిపెట్టారు.. బందోబస్తు చర్యల్లో భాగంగా రథాన్ని పరశీలించగా వెండి సింహాలు మాయమైన విషయం వెలుగు చూసింది.. ఈ విగ్రహాల మాయంపై అధికారులు చేస్తున్న ప్రకటనలు కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి.. ఈవో సురేష్‌ బాబు పొంతన లేని సమాధానాలు చెప్పారు. మరో రథానికి రెండే సింహాలు ఉన్నందున దీనికి కూడా రెండే ఉంటాయని చెప్పడం ఈవో బాధ్యతా రాహిత్యాన్ని తెలియజేస్తోందని భక్తులంటున్నారు.

ఈ ఘటనలో అధికారులపై చర్యలు తీసుకోకపోవడం, మాయమైన సింహాలకు సంబంధించి కేసు నమోదు చేయకపోవడంతో భక్తులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వెండి సింహాలు వున్నాయా లేదా అనేది తాను రిజిస్టర్‌ చూసి నిర్ధారణకు రావాల్సి ఉందని ఈవో చెప్పడం వెనుక ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంచేస్తున్నారా అన్న అనుమానాలను భక్తులు వ్యక్తపరుస్తున్నారు. అటు ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ధార్మిక సంస్థల ప్రతినిధులు ఆలయంలోని రథాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అటు ఆలయ రథాన్ని టీడీపీ నేతలు దేవినేని ఉమ, బుద్ధా వెంకన్న పరిశీలించారు. మంత్రి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.. మూడు సింహాల దొంగలెవరో వెల్లంపల్లితోపాటు ఈవో సురేష్‌కు తెలుసని వారన్నారు. పోలీసులతో కమిటీ వేయకుండా నిజనిర్ధారణ కమిటీ వేయడంలో ఆంతర్యమేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అటు జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్‌ కూడా అమ్మవారి రథాన్ని పరిశీలించారు.. అధికారులు, మంత్రి తీరుపై మండిపడ్డారు. అర్హత లేని వ్యక్తిని ఈవోగా నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్గగుడి విషయంలో మంత్రి ఎందుకు స్పందించడంలో చెప్పాలన్నారు. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పందించారు. రథానికి భద్రత కల్పించే చర్యల్లో భాగంగా అధికారులు చూడగా సింహాలు మాయమైనట్లు గుర్తించారన్నారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది విచారణలో తేలుతుందన్నారు. మొత్తంగా దుర్గమ్మ ఆలయ రథంలో వెండి విగ్రహాలు ఏమయ్యాయి అనే దానిపై భక్తుల్లోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నియమించిన కమిటీతో నిజాలు బయటకు వస్తాయా అని ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story