SOMIREDDY: సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష

SOMIREDDY: సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష

తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మద్ధతు తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరు భారత్ మైకా మైన్స్ లో జరగుతున్న అక్రమమైనింగ్ ను నిలిపివేయాలంటూ శనివారం నుంచి సోమిరెడ్డి నిరసన చేపట్టారు. శనివారం భారత్ మైకా గనులను పరిశీలించిన సోమిరెడ్డి రాత్రి గనుల వద్దే బస చేశారు. సోమిరెడ్డి చెపట్టిన దీక్షలో టీడీపీ నాయకులు తాడిపర్తి, వరదాయపాలెం, పొదలకూరు గ్రామస్తులు పాల్గొన్నారు.


మరోవైపు నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకులు బందిపోట్ల కన్నా ప్రమాదకరంగా మారారని, ప్రకృతి సంపదను బరితెగించి దోచుకుంటున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కోట్ల విలువైన క్వార్ట్జ్‌ను అక్రమంగా తవ్వి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.నెల్లూరు జిల్లాలో రోజుకు సుమారు 4 కోట్ల రూపాయల విలువైన వెయ్యి టన్నుల క్వార్ట్జ్‌ను యంత్రాలతో తవ్వి అక్రమంగా తరలి స్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. తాటిపర్తి పంచాయతీ పరిధిలోని రుస్తుం, భారత్‌ మైకా గనుల్లో క్వార్ట్జ్‌ తవ్వకాలను ఆయన పరిశీలించారు. గనులకు సమీపంలోనే 50 గిరిజన కుటుంబాలు ఉన్నాయని పేలుళ్ల ధాటికి రాళ్లు ఎగిరి వారి ఇళ్లపై పడుతున్నా... అక్రమార్కులు పట్టించుకోవడం లేదన్నారు. భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ, గనులశాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలను నిలిపేయాలని ఈ నెల 7న హైకోర్టు ఆదేశాలిచ్చినా.. కలెక్టర్‌, గనులశాఖ అధికారులు స్పందించలేదన్నారు. 12 యంత్రాలు, 30 టిప్పర్లతో సుమారు వంద అడుగుల మేర తవ్వేశారని మండిపడ్డారు.


మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సొంత గ్రామానికి సమీపంలోనే ఇంత దారుణం జరుగుతున్నా.. ముడుపులు తీసుకుని పట్టించుకోవడం లేదని సోమిరెడ్డి ఆరోపించారు. అక్రమ తవ్వకాల్లో A1, A 2లుగా మంత్రి కాకాణి, వైసీపీ నాయకుడు శ్యాంప్రసాద్‌రెడ్డిని చేర్చాలని డిమాండ్‌ చేశారు. శనివారం సాయంత్రం మైన్‌ వద్దకు వెళ్లిన సోమిరెడ్డి.. అక్కడే బైఠాయించారు. అధికారులు వచ్చి అక్రమ మైనింగ్‌ను అడ్డుకుని, వాహనాలను సీజ్‌ చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. రాత్రి అక్కడే బస చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అక్రమంగా జరుగుతున్న రుస్తుం, భారత్ మైకా మైన్స్ దోపిడీ ఆపాలంటూ చిమ్మ చీకట్లోనూ సోమిరెడ్డి ఆందోళన కొనసాగించారు. అధికారులు రావాలని వచ్చేంత వరకు వాహనాలను బయటకు వదలబోమని... సోమిరెడ్డి క్వారీల వద్దే కూర్చున్నారు. అక్కడకు భారీగా చేరుకున్న స్థానికులు సోమిరెడ్డికి మద్దతుగా ఆందోళన చేపట్టారు. వైకాపా నేతలు 3 వారాలుగా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని.. రోజుకు 2 వేల టన్నుల క్వార్ట్జ్ ను దోపిడీ చేస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. అక్రమ మైనింగ్ ఆపాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

Next Story