ఎక్కడైనా విన్నారా.. గుడ్డు వెయ్యి రూపాయలు, పుంజు లక్ష రూపాయలట

ఆహా.. లక్షాధికారి అయిపోవడం ఇంత ఈజీనా.. గుడ్లు, కోళ్లు అమ్ముకుని బతికేస్తే లైఫ్ హ్యాపీ అన్నమాట.. మరికెందుకు ఆలస్యం ఆయన కోళ్ల ఫారమ్ రహస్యమేంటో మనమూ తెలుసుకుందాం.. ఛలో ముండ్లపాడు..
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన రైతు మందగంటి పెద్ద పుల్లయ్య గత 30 ఏళ్లుగా కోళ్లను పెంచుతున్నాడు.. కోళ్ల ఫారాన్ని నడుపుతున్న ఆయన కోళ్ల పెంపకంలో ఆరి తేరాడు.. 30 ఏళ్లు పెంచిన కొడుకు గురించి అర్థం కాకపోయినా మూడు నెలల కోడిని గురించిన విశేషాలు ముచ్చటగా వివరిస్తాడు. అరుదైన జాతి కోళ్లకు మంచి ఆహారం అందిస్తూ ఆరోగ్యంగా పెంచుతున్నాడు. మొదట్లో తాపీమేస్త్రిగా జీవనం కొనసాగించే పుల్లయ్య ఇంట్లో వివిధ రకాల నాటు కోళ్లతో పాటు బెడస జాతికి చెందిన కోళ్లు కూడా పెంచేవాడు.. అయితే నాలుగేళ్ల క్రితం తాపీమేస్త్రి పనికి స్వస్తి పలికి ఊళ్లో ఉన్న 2 ఏకరాల పొలంపైనే శ్రద్ధ పెట్టాడు.. సొంతగా సాగు చేసుకోవాలనుకున్నాడు..
ఈ క్రమంలోనే అరుదైన జాతి కోళ్లను పెంచాలన్న తన కలను నెరవేర్చుకోవాలనుకున్నాడు.. అందుకోసం ఊరూరు తిరిగాడు.. అరుదైన జాతి కోళ్ల గురించి ఎంక్వైరీ చేశాడు.. చివరికి అతడి ప్రయత్నం ఫలించి మూడు నెలల క్రితం తమిళనాడు రాష్ట్రంలోని పొల్లాచ్చిలో పెద్దపర్ల జాతికి చెందిన ఏడు నెలల వయసు గల కోడిని లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడు. ఈ చుట్టు పక్కల గ్రామాల్లో ఎక్కడా తన దగ్గర ఉన్న అరుదైన జాతి పుంజు లాంటిది లేదని పుల్లయ్య ఒకింత గర్వంగా చెబుతాడు. తన వద్ద ఉన్న మిగతా కోళ్లు కూడా ఏం తక్కువ కాదు.. అవి కూడా రూ.30 వేల పై మాటే అంటున్నాడు.
ఆప్టరాల్ కోడికి ఇంత ఖర్చు పెడుతున్నావా అని ఎగతాళి చేసేవాళ్లూ ఉన్నారు. అయినా అవేమీ పట్టించుకోను.. పిల్లలకంటే ఎక్కువగా పెంచుకుంటున్నాను ఈ కోడి పిల్లలను, పుంజులను.. అవి నన్ను అన్యాయం చేయవని.. నా కష్టానికి ఫలితం ఇస్తాయని అంటూ ఎంతో నమ్మకంగా చెబుతున్నాడు పుల్లయ్య. వీటి ఫుడ్డూ, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ కలిపి ఒక్కో కోడికి దాణా కోసం నెలకు రూ.3 వేల వరకు ఖర్చు చేస్తానని అంటున్నాడు.
ఇంట్లో మీ పిల్లలకైనా పెడతారో లేదో అలాంటి ఫుడ్డు మరి.. ఖర్చవకుండా ఎలా ఉంటుంది.. బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఉడికించిన గుడ్డు, శనగలు, వేరు శనగలు, రాగులు, సజ్జలను కోళ్లకు దాణాగా పెడతారు. ఒక్కోసారి తినని మారాం చేస్తే ఒళ్లో కూర్చోబెట్టుకుని బుజ్జగిస్తూ ప్రేమగా పిల్లలకి తినిపించినట్లు తినిపిస్తారట. నెలకు రూ.30 వేలు ఆదాయం ఇస్తున్న కోళ్ల పెంపకం ఎంతో సంతృప్తినిస్తుందని చెబుతున్నారు పుల్లయ్య. పది రోజుల కోడి పిల్ల కావాలంటే రూ.5 వేలు, కోడి గుడ్డు కావాలంటే ఒక్కోటి వెయ్యి రూపాయలకు అమ్ముతారట. ఏదేమైనా చేసే పని పట్ల శ్రద్ధ వహిస్తే ఫలితం ఉంటుందని నిరూపిస్తున్నారు పుల్లయ్య.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com