Srimukhalingamశిథిలావస్థలో శ్రీముఖలింగేశ్వర ఆలయం

Srimukhalingamశిథిలావస్థలో శ్రీముఖలింగేశ్వర ఆలయం
పెచ్చులూడిపోతున్న ప్రాచీన సంపద

దక్షిణ కాశీగా పేరొందిన శ్రీముఖలింగేశ్వరుడి పుణ్యక్షేత్రం... అభివృద్ధికి నోచుకోవడంలేదు. ఆలయ నిర్వహణపై నిర్లక్ష్యంతో శిల్ప సంపద శిథిలమైపోతోంది. వందల ఏళ్ల నాటి పురాతన శాసనాలు, శిల్పాలు పెచ్చులూడిపోతున్నాయి. మౌలిక సదుపాయాల కొరతతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో దర్శనంతో మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగంలో వెలసిన శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం దక్షిణ భారతదేశంలో రాతితో నిర్మించిన ఏకైక దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. ఒకటి తక్కువ కోటి లింగాల క్షేత్రంగానూ ఖ్యాతినార్జించింది. ఆలయంలో కైలాసనాథుడులింగముఖ రూపంలో దర్శనిమిస్తున్నందునే... శ్రీముఖలింగంగా పిలుస్తారు. ఈ ఆలయాన్ని పదో శతాబ్దానికి ముందు రెండో కామార్ణవుడు అనే రాజు కట్టించారని శాసనాల ద్వారా తెలుస్తోంది.

ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని... ఏటా లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. అయితే... శ్రీముఖలింగంలో పర్యాటకలను అబ్బురపరిచే శిల్ప సౌందర్యం... కాలక్రమేణా దెబ్బతింటోంది. రాతిపై అద్భుతంగా చిత్రించిన చిత్ర కళా సౌందర్యం.... నిర్వహణా లోపంతో పాడైపోతోంది. ఆలయం లోపలి గోడలు పెచ్చులూడుతున్నాయి. దేవీ దేవతల విగ్రహాల ముఖం, చేతులు, కాళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. అవి కిందపడిపోయి రూపు మారుతున్నాయి. ఈ క్షేత్ర అభివృద్ధికి 50 కోట్ల నిధులతో ప్రతిపాదనలు పంపినా... ఇప్పటికే మంజూరు కాలేదు. గత ప్రభుత్వ హయాంలో మాస్టర్‌ప్లాన్ రూపొందించి 20 కోట్ల మంజూరుకు ఆమోదముద్ర పడినా... ఈలోపు వైకాపా పాలన రావడంతో నిధులు విడుదల కాలేదు. దీనివల్ల ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవసరమైన సత్రాలు, ఇతర మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అయినా పాలకులు పట్టించుకోవడం లేదు. ఆలయాన్ని అభివృద్ధి చేసి, మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే... పర్యాటకుల రాక పెరుగుతుందని అర్చకులు, కార్యనిర్వహణాధికారి అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story