తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తున్న ఎండలు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. ఉదయం నుంచే సూర్యుడు విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. సన్‌స్ట్రోక్‌తో సెగలు రేపుతూ భగభగమంటున్నాడు. భానుడి ప్రతాపానికి ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. పగలు ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో దడ పుట్టిస్తుంటే.. రాత్రిళ్లు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. రోజురోజుకు మండిపోతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు రికార్డుస్థాయిలో పెరిగిపోతున్నాయి. విజయవాడ, విశాఖ సహా పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చీరాలలో ఎన్నడూ లేనంత అత్యధికంగా 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అటు బుచ్చిరెడ్డిపాలెం, బల్లికురువలోను 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే రాష్ట్రంలోని 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 116 మండలాల్లో వడగాల్పులు వీచాయి.

ఐదారు రోజులుగా ఉత్తర కోస్తాలో వీస్తున్న వడగాల్పులు.. దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత పెరుగుతోందని వెల్లడించింది. విజయనగరం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లా, కడప, మన్యం, కాకినాడ, అల్లూరి జిల్లా, గుంటూరు, కృష్ణా, పల్నాడు, తూర్పుగోదావరి, నంద్యాల, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లోని 117 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల సంస్థ హెచ్చరించింది. మధ్యాహ్నం సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని సూచించింది. ఇక ఎండలు మండుతున్న వేళ.. నిన్న ఏజెన్సీలో వర్షం బీభత్సం సృష్టించింది. ఈనెల 21 నుంచి 24 వరకు కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇస్రో చల్లటి కబురు అందించింది.

ఇక తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మధ్యాహ్నం ఎండలు తీవ్రంగా ఉంటే.. సాయంత్రం వర్షం కురుస్తోంది. రాత్రి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతకొన్ని రోజులుగా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న గరిష్ఠంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్‌, ఖమ్మం, జగిత్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని పలు మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు సాధారణం కన్నా 3 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మే నెలల్లో 44 నుంచి 46 డిగ్రీలకు పెరగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోని పలుప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల వడగళ్లు పడ్డాయి. నాంపల్లిలో గరిష్ఠంగా 1.8 సెం.మీటర్లు, బహదూర్‌పురలో 1.6 సెం.మీటర్ల వర్షం కురిసింది. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోనూ వర్షం కురిసింది.

Tags

Read MoreRead Less
Next Story