ఇది ప్రజా విజయం : ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఇది ప్రజా విజయం : ఎంపీ రఘురామకృష్ణంరాజు
ఏపీలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన 81, 85 జీవోలను..

ఏపీలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన 81, 85 జీవోలను.. హైకోర్టు కొట్టేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం అత్యున్నత ధర్మాసనం తలుపు తట్టింది. ఏప్రిల్ 15న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జూన్ 4న SLP వేశారు. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ కెఎం జోసెఫ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది విశ్వనాథ్‌ వాదనలు వినిపించారు. హైకోర్టు ఉత్తర్వులు సెంట్రల్‌బోర్డు నిబంధనలకు విరుద్ధమని అన్నారు. దీనిపై నోటీసులు జారీ చేస్తామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది.

మాతృభాషలోనే విద్యాబోధన జరగాలనే నిబంధన... విద్యాహక్కు చట్టంలో లేదని ప్రభుత్వం తరపు అడ్వొకేట్ వాదించారు. ఇంగ్లీష్ మీడియంలో బోధనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రగతిశీల నిర్ణయం అంటూ చెప్పుకొచ్చారు. తెలుగు మీడియంలో విద్యాబోధన వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం తీవ్రంగా తగ్గిపోతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. అటు, ప్రతివాదుల తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది శంకర్‌రాయణన్ ప్రభుత్వ వాదనతో విభేదించారు. విద్యార్థులు తెలుగు మీడియం ఎంచుకునే అవకాశం కాలరాస్తున్నారని అన్నారు. తెలుగు మీడియం పాఠశాలలు పూర్తిగా కనుమరుగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు..హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ.. కేసుని 3 వారాలకు వాయిదా వేసింది.

నిర్భంద ఇంగ్లీష్ మీడియం బోధన రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ హైకోర్టు తీర్పు ఇచ్చినా... పట్టువిడువని విక్రమార్కుడిలా జగన్మోహన్ రెడ్డిప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్నారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. అయినా రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధనను సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు. ఇది ప్రజా విజయంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీ సైతం గుజరాతీలోనే విద్యాభ్యాసం చేశారని రఘురామ కృష్ణరాజు గుర్తుచేశారు. ప్రాథమిక దశలో విద్యార్థులు ఏ భాషలో చదవాలనేది వారికే వదిలేయలంటూ హైకోర్టు గతంలో తీర్పు చెప్పింది. పూర్తిగా ఇంగ్లీష్ విద్య సరికాదంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కారు సుప్రీంకి వెళ్లినా అక్కడ కూడా ఊరట లభించలేదు.

Tags

Read MoreRead Less
Next Story