పోర్న్‌ లింక్‌ వ్యవహారం.. మరో నలుగురు ఎస్వీబీసీ ఉద్యోగులకి షోకాజ్ నోటీసులు

పోర్న్‌ లింక్‌ వ్యవహారం.. మరో నలుగురు ఎస్వీబీసీ ఉద్యోగులకి షోకాజ్ నోటీసులు

పోర్న్‌ లింక్‌ వ్యవహారం ఎస్వీబీసీ ఉద్యోగుల మెడకు చుట్టుకుంది. ఓ భక్తుడికి అశ్లీల వీడియోలు షేర్‌ చేసిన ఘటనపై టీటీడీ ఐదుగురు ఉద్యోగులను తొలగించింది.. మరో నలుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.. ఈ ఘటన వెలుగు చూసిన మొదటిరోజే ఒకర్ని విధుల నుంచి తొలగించిన అధికారులు.. ఆ తర్వాత విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. విచారణ జరిపిన విజిలెన్స్‌ అధికారులు.. టీటీడీ ఈవోకు నివేదిక ఇచ్చారు.. ఈ నివేదిక ఆధారంగా వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్‌ డిజైనర్లు ప్రకాశ్‌, రామ్మూర్తి, రాదేష్‌, మోహన్‌రావు, వీరబాబుపై వేటు పడినట్లుగా తెలుస్తోంది.. మరో నలుగురు సీనియర్‌ ఉద్యోగులు శ్రీనివాస్‌, కృష్ణారావు, సోమశేఖర్‌, మురళీకృష్ణకు షోకాజు నోటీసులు ఇచ్చారు.

పుట్టినరోజునాడు వేదమంత్రాలతో ఆశీర్వదించే ఉద్దేశంతో శతమానంభవతి కార్యక్రమం రూపొందించింది ఎస్వీబీసీ. ఆ ప్రోగ్రామ్ కోసం ఓ భక్తుడు మెయిల్ చేశాడు. థ్యాంక్యూ అనో, మెయిల్ అందిందనో రిప్లై ఇవ్వాల్సిన సిబ్బంది.. తాము చూస్తున్న పోర్న్‌ వీడియోల లింక్ పంపించారు. ఆ భక్తుడు టీటీడీ ఛైర్మన్, ఈవోకి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్.. ఎస్వీబీసీ ఆఫీసులోనే నీలి చిత్రాలు చూస్తున్న పలువురు ఉద్యోగులను గుర్తించింది. పోర్న్‌ వీడియో లింక్ పంపిన ఉద్యోగిని టీటీడీ ఇప్పటికే తొలగించగా.. తాజాగా మరికొందరిపై వేటు పడింది. మరో నాలుగైదు రోజుల్లో మరికొంతమందికి కూడా షోకాజు నోటీసులు జారీ చేస్తారన్న ప్రచారంతో ఎస్వీబీసీ ఉద్యోగుల్లో టెన్షన్‌ మొదలైంది.

Tags

Read MoreRead Less
Next Story