AP: తెలుగుదేశం - జనసేన కూటమిలో ఫుల్‌ జోష్‌

AP: తెలుగుదేశం - జనసేన కూటమిలో ఫుల్‌ జోష్‌
సంబరాల్లో మునిగిపోయిన అభ్యర్థులు... గెలుపును కానుకగా ఇస్తామని ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా తెలుగుదేశం - జనసేన కూటమిలో జోష్‌ నింపింది. అభ్యర్థిత్వాలు దక్కివారు, వారి అనుచురులు సంబరాల్లో మునిగిపోయారు. సీటు కేటాయించిన అధినేతలకు ధన్యవాదాలు చెబుతూ, గెలుపును బహుమతిగా ఇస్తామని ఉత్సాహంగా చెబుతున్నారు. ఇదే ఊపులో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. మంగళగిరిలో పలువురు కార్యకర్తలు వైసీపీని వీడి లోకేష్‌ సమక్షంలో సైకిలెక్కారు. ఓడినచోటే గెలవాలనే పట్టుదలతో మళ్లీ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నట్లు లోకేష్‌ తెలిపారు. ఈ పన్నుల ముఖ్యమంత్రి ఒక చేత్తో వంద రూపాయలు ఇచ్చి, మరో చేత్తో వెయ్యి రూపాయలు లాగేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.


పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆరిమిల్లి రాధాకృష్ణ "సకల జనుల చైతన్య యాత్ర - రేపటి కోసం పాదయాత్ర" ఆరో రోజూ కొనసాగింది. తణుకు సీటు ఆరిమిల్లికి కేటాయించడంతో కార్యకర్తలు, ప్రజలు అభినందనల్లో ముంచెత్తారు. అనకాపల్లి సీటు దక్కిన జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ, రాజుపాలెంలోని సూర్యనారాయణమూర్తి, అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అందరినీ కలుపుకొని ఎన్నికల్లో విజయం సాధిస్తానని కొణతాల ధీమా వ్యక్తం చేశారు. టెక్కలి నియోజకవర్గంలో వైసీపీకి చెందిన 400 కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాలకు తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించడంపై తిరుపతి జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు నరసింహ యాదవ్‌ హర్షం వ్యక్తంచేశారు. నాయుడుపేట ఇన్‌ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం నివాసంలో సమావేశం ఏర్పాటుచేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పులివెందుల సీటు దక్కించుకున్న బీటెక్‌ రవి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డిని కలిసి తెలుగుదేశంలోకి రావాలని ఆహ్వానించారు. తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవిరెడ్డికి కడప అసెంబ్లీ సీటు ప్రకటించడంతో.... అనుచరులు సంబరాలు చేసుకున్నారు. ఈ జోష్‌లో 32, 33, 34, 35 డివిజన్ల పార్టీ కార్యాలయాలను శ్రీనివాసరెడ్డి, మాధవిరెడ్డి కలిసి ప్రారంభించారు.

తెలుగుదేశం తొలి జాబితా రావడంతో విదేశాల్లోనూ పార్టీ సానుభూతిపరులు సంబరాలు చేసుకున్నారు. మెల్‌బోర్న్‌లో ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైసీపీకి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. చంద్రబాబు నేతృత్వంలోనే రాష్ట్రానికి తిరిగి పూర్వవైభవం వస్తుందని ఆకాంక్షించారు.

Tags

Read MoreRead Less
Next Story