AP: ఆంధ్రప్రదేశ్‌లో గుంతల రాజ్యం

AP: ఆంధ్రప్రదేశ్‌లో గుంతల రాజ్యం
గోతులమయంగా మారిన రోడ్లపై టీడీపీ-జనసేన పోరుబాట... గుంతల రోడ్లపై కూర్చొని నిరసన..

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రహదారుల దుస్థితిని తెలియజెప్పేందుకు గుంతలరాజ్యం పేరిట తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, చింతాడలో గోతులమయంగా మారిన రోడ్లపై నాయకులు ఆందోళన చేపట్టారు. పార్వతీపురంలో రోడ్లపై ఉన్న గోతుల వద్ద నిరసన తెలిపారు. విశాఖలో గుంతల రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధ్వాన్న రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో భారీ నిరసన ర్యాలీ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏపీ అభివృద్దిని గాలికి వదిలేసిందని తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు.


పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో రహదారి గుంతల వద్ద ఇరుపార్టీల నాయకులు నిరసన తెలిపారు. ఏలూరులో గుంతల్లో పసుపు కుంకుమ జల్లి కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేశారు. గుంటూరుని గుంతలూరుగా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. కృష్ణా జిల్లా పామర్రు నుంచి అవనిగడ్డ వెళ్లే రహదారిపై ప్రమాదకరంగా తయారైన గోతుల వద్ద నిరసన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్ నుంచి మొగులూరు వెళ్లే రోడ్డుపై గుంతలు పూడ్చి నిరసన తెలిపారు. మైలవరంలో గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది కార్యక్రమం నిర్వహించారు.


కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గుంతల ఆంద్రప్రదేశ్‌కు దారేది అంటూ నిరసన చేపట్టారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో రోడ్ల అధ్వాన స్థితిని చూపిస్తూ ఆందోళన చేశారు. సత్యసాయి జిల్లాలో పెనుకొండలోరహదారి పూర్తిగా గుంతలమయమైందంటూ నేతలు మండిపడ్డారు. శ్రీకాళహస్తిలో నీళ్లు నిలబడిన రోడ్డు గుంతల్లో కాగితపు పడవలు వదిలి వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండలాల్లో అధ్వానంగా ఉన్న రోడ్లపై నిరసన చేపట్టారు. కంకరతేలిన రోడ్డుపై మోకాళ్లపై కూర్చొని నేతలు ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ చేశారు.

బాహుబలి సినిమాలో వెండితెరపై కుంతల రాజ్యాన్ని చూశామని... జగన్‌ అంకుల్‌ పాలనలో మాత్రం నిజ జీవితంలో ‘గుంతల రాజ్యాన్ని’ చూస్తున్నామని గతంలో నారా లోకేశ్‌ ఆరోపించారు. రహదారులపై ఏకంగా లారీలే పడిపోయేంత పెద్దవని... కొత్త రోడ్లు వేయలేదు సరికదా వాటిపై గుంతలను కూడా పూడ్చలేని అసమర్థ పాలన జగన్‌దని లోకేశ్‌ మండిపడ్డారు. నిత్యం ఇక్కట్లు పడుతున్న జనం నిరసనలకు దిగుతున్నారని.... అయినా జగన్‌ అంకుల్‌కి ఉలుకూ పలుకు లేదని ఎద్దేవా చేశారు. 2020 జులై 15 నాటికి గుంతలు లేని రోడ్లను చూపిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించారని.. 2023 జులై 15 వెళ్లినా ఇంతవరకు ఒక్క గుంత పూడ్చలేదని మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story