Kakinada : బోట్లకు నిప్పంటించి మరీ మత్స్యకారుల నిరసన

Kakinada : బోట్లకు నిప్పంటించి మరీ మత్స్యకారుల నిరసన
కాకినాడలో ఉద్రిక్తత

కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలోకి ఫార్మా పరిశ్రమల వ్యర్థాల్ని వదిలే పైపులైన్లు తొలగించాలంటూ మత్స్యకారులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లి...ఉపాధి కోల్పోతామని కోనపాపపేట వాసులు నిరసన తెలిపారు. మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నాఎవరూ పట్టించుకోవడం లేదంటూ బోటుకు నిప్పంటించి ఆందోళన నిర్వహించారు.

కాకినాడ S.E.Z. పరిధిలోని తొండంగి మండలంలో ఏర్పాటైన ఫార్మా పరిశ్రమ వ్యర్థాలు తమ జీవనోపాధికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని....ఉప్పాడ కొత్తపల్లి మండలం కోనపాపపేట వద్ద మత్స్యకారులు బుధవారం నుంచి ఆందోళన చేస్తున్నారు. కాకినాడ-అద్దరిపేట రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. గ్రామంలో బంద్ పాటించి ఆందోళన చేస్తున్నాతమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ...ఉదయం ఒక్కసారిగా రోడ్డెక్కారు. మత్స్యకారులంతా భారీ ర్యాలీ తీశారు. రహదారిపైనే ఓ బోటును దగ్ధం చేసి నిరసన తెలిపారు. కొంతమంది ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. పైపు లైన్లు తొలగించాలని నినాదాలు చేశారు. మత్స్యకారుల ఆందోళనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పరిశ్రమల వ్యర్థాలు పైపులైన్ల ద్వారా సముద్రంలో కలిస్తే మత్స్య సంపద కనుమరుగై జీవనోపాధి ప్రశ్నార్థకమవుతుందని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అనేకసార్లు నిరసన చేపట్టినా...జిల్లా ఉన్నతస్థాయి అధికారుల వద్ద గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేకపోయిందని వాపోయారు. వందలాది మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన విషయాన్ని స్థానిక నేతలూ పట్టించుకోవడం లేదన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. SPOT....

మత్స్యకారుల ఆందోళనతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించాలని...లేకుంటే ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని జాలర్లు హెచ్చరించారు.

ఉప్పాడ తీరంలో చేపల వేటను ఆధారంగా చేసుకుని చాలా మంది మత్స్యకారులు బతుకుతున్నారు. ఇప్పుడు వారి జీవనోపాధికే భంగం కలిగే ఆపద వాటిల్లింది. అందుకే మత్స్యకారులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఇంతకు ముందే దీని గురించి అధికారులకు చెప్పినా పట్టంచుకోలేదు. నేతలతో మొరపెట్టుకున్న పని జరగలేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అందుకే ఇప్పుడు ధర్నా చేస్తున్నామని తెలిపారు. సుమారు వెయ్యి మంది మత్స్యకారులు మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story