తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు లేనట్టే!

తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు లేనట్టే!
తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు ప్రతిష్టంభన వీడడటం లేదు. ఏపీ, తెలంగాణ ఈడీ స్థాయి అధికారుల చర్చలు కొలిక్కి రాలేదు. ఎవరి వాదన నుంచి వారు వినిపించారు..

తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు ప్రతిష్టంభన వీడడటం లేదు. ఏపీ, తెలంగాణ ఈడీ స్థాయి అధికారుల చర్చలు కొలిక్కి రాలేదు. ఎవరి వాదన నుంచి వారు వినిపించారు. కిలోమీటర్ల అంశం తేలితేనే.. ఏ బస్సులనైనా ప్రారంభించుకుందామంటూ స్పష్టం చేశారు తెలంగాణ ఆర్టీసీ అధికారులు. ఏపీ అధికారులు కిలోమీటర్లు తగ్గించుకోవాలంటూ తెలంగాణ అధికారులు, తగ్గించుకోబోమంటూ ఏపీ అధికారులు వాదించడంతో మూడున్నర గంటల పాటు చర్చలు సాగినా.. ఎలాంటి ఫలితమివ్వలేదు. ఇక పండగల సీజన్‌లో ప్రత్యేక బస్సులను నడుపుకొందామన్న ఆలోచనకూ ఇరువర్గాలు ఒప్పుకోలేదు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల అధికారులు మూడు సార్లు చర్చలు జరిపారు. తాజాగా నాలుగోసారి బస్‌భవన్‌లో ఇరు సంస్థల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల మధ్య చర్చలు కూడా విఫలమయ్యాయి.

ఏపీకి చెందిన 1009 బస్సులు తెలంగాణలోని 72 రూట్లలో 2.64 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. తెలంగాణకు చెందిన 746 బస్సులు ఏపీలోని 27 రూట్లలో 1,61,800 కి.మీ. తిరుగుతున్నాయి. అయితే తాము ఏపీలో తిప్పుతున్న 1.61 లక్షల కి.మీ. మేరకే ఏపీ బస్సులు కూడా తెలంగాణలో తిరగాలంటున్నారు టీఎస్‌ఆర్టీసీ అధికారులు. ఇందుకు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు ఒప్పుకోలేదు. ప్రస్తుతం మాదిరే తాము 2.64 లక్షల కి.మీ. మేర తిప్పుతామంటున్నారు. ఈ అంశంపై ఇరు వర్గాలు వెనక్కి తగ్గలేదు. అంతకుముందు చర్చల్లో కిలోమీటర్లను పెంచుకోవాలంటూ ఏపీ అధికారులు తెలంగాణకు సూచించారు. కానీ, తాము పెంచబోమని, మీరే తగ్గించుకోవాలంటూ గతంలోనే స్పష్టం చేశారు తెలంగాణ అధికారులు. ఇప్పుడు ఇదే అంశంపై ఏపీ అధికారులు పట్టుబట్టకపోయినా.. 2.64 లక్షల కిలోమీటర్లను మాత్రం తగ్గించుకోబోమన్నారు. దీనికి అంగీకరించబోమని తెలంగాణ అధికారులు చెప్పడంతో చర్చలు ముందుకు సాగలేదు.

Tags

Read MoreRead Less
Next Story