శ్రీవారి బంగారం డిపాజిట్లపై వివరణ ఇచ్చిన టీటీడీ

శ్రీవారి బంగారం డిపాజిట్లపై వివరణ ఇచ్చిన టీటీడీ
శ్రీవారి బంగారం డిపాజిట్లపై వివరణ ఇచ్చింది TTD. ఒకటిన్నర దశాబ్దానికి పైగా బంగారాన్ని గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నట్లు వెల్లడించింది..

శ్రీవారి బంగారం డిపాజిట్లపై వివరణ ఇచ్చింది TTD. ఒకటిన్నర దశాబ్దానికి పైగా బంగారాన్ని గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నట్లు వెల్లడించింది. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో నిర్ణయించిన 2.5శాతం వడ్డీ ప్రకారం దీర్ఘకాలిక ప్రాతిపదికగానే బంగారాన్ని ఉంచాలని TTD ధర్మకర్తల మండలి తీర్మానించినట్లు పేర్కొంది. గోల్డ్ మానిటైజేషన్ స్కీంలో ఎక్కువ మొత్తంలో బంగారం డిపాజిట్లను స్వీకరించే బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానమైనదని.. ఇప్పటికి కూడా దీర్ఘకాల ప్రాతిపదికన పెద్ద మొత్తంలో బంగారం డిపాజిట్లను స్వీకరించేందుకు చాలా బ్యాంకులు ముందుకు రావడం లేదని చెప్పింది.

స్టేట్ బ్యాంకులో TTD ద‌శాబ్ధ కాలానికి పైగా బంగారం డిపాజిట్లు చేస్తోందని.. ఈ బ్యాంకులో దాదాపు 7వేల 800 కిలోల బంగారం డిపాజిట్లు ఉంచ‌డం అన్నది స్టేట్ బ్యాంకుతో TTDకి ఉన్న దీర్ఘకాలిక బ్యాంకు లావాదేవీల అనుబంధాన్ని తెలియ‌జేస్తోందని తెలిపింది. ఈ 7వేల 800 కిలోల బంగారం డిపాజిట్లను స్టేట్ బ్యాంకులో 2017 నుండి 4వేల470 కిలోలు, 2018 నుండి 920 కిలోలు, 2019 నుండి 13వందల 80 కిలోలు, అదే విధంగా 2020 నుండి మిగిలిన మొత్తం బంగారాన్ని డిపాజిట్లుగా పెట్టడం జరిగిందని TTD స్పష్టం చేసింది.

ఇక.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంగారం డిపాజిట్ చేయడం వెనుక ఎలాంటి రహస్య అజెండా లేదని TTD వెల్లడించింది. దీర్ఘకాల ప్రాతిపదికన బంగారం డిపాజిట్లు స్వీకరించేందుకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అంగీకరించలేదని.. బంగారాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పడంతో 6 నెలల సమయం కావాలని కోరినట్లు TTD పేర్కొంది. ఈ 6 నెలల కాలానికి గాను దీర్ఘకాలిక గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌ కింద ఇతర బ్యాంకులు ఇస్తున్న 2.5శాతం వడ్డీని తాము కూడా 6 నెలలకు చెల్లిస్తామని ఆ బ్యాంకు తెలియజేసినట్లు చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో బోర్డు నిర్ణయించిన మేరకు దీర్ఘకాలిక ప్రాతిపదికగా TTD బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయడం జరిగినట్లు అధికారికంగా ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story