AP News: విశాఖ మెట్రోకు ఆమోదం.. ఎన్నికల వ్యూహమా

AP News:  విశాఖ మెట్రోకు ఆమోదం.. ఎన్నికల వ్యూహమా
అనుమానిస్తున్న ప్రజలు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ జగన్‌కు విశాఖపట్నం లైట్‌ మెట్రోరైలు ప్రాజెక్టు గుర్తుకొచ్చింది. విశాఖవాసులను మభ్యపెడుతూ మెట్రో డీపీఆర్‌ను అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల తర్వాత ఆమోదించారు. డీపీఆర్‌ ఆమోదానికే సంవత్సరాల తరబడి నాన్చారు. మరి ప్రాజెక్టు ఎప్పుటికి పూర్తి చేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కడప జిల్లాలో 2019 డిసెంబరులో ఉక్కుఫ్యాక్టరీ శంకుస్థాపన సభలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలివి. ఇన్ని సూక్తులు చెప్పిన ఆయనకు.. విశాఖపట్నం లైట్‌ మెట్రోరైలు ప్రాజెక్టు ఎన్నికలకు ముందే గుర్తుకొచ్చింది. నాలుగున్నరేళ్లు దీన్ని మర్చిపోయారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీని డీపీఆర్‌ను ఆమోదించారు. దీన్నిబట్టే సీఎంకు ఈ ప్రాజెక్టుపై ఎంత చిత్తశుద్ధి ఉందో స్పష్టమవుతుంది.

మొదట్లోనే ఈ పనులు ఆరంభిస్తే.. ఈ పాటికి మొదటిదశ అయినా పూర్తయ్యేది. ఇప్పుడు డీపీఆర్‌ని ఆమోదించడమంటే.. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించడమే. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద మెట్రోరైలు ప్రాజెక్టుకు 14 వేల 309 కోట్లు అవుతుంది. ఇందులో రాష్ట్రప్రభుత్వ వాటా 20శాతం కింద 2 వేల862 కోట్లు వెచ్చించాలి. రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారుల గుంతలు పూడ్చేందుకు తట్ట మట్టి వేయలేని దుస్థితిలో ఉన్న జగన్‌ ప్రభుత్వం.. ఈ ప్రాజెక్టుకు నిధులు ఇస్తుందంటే నమ్మాలా? ఎన్నికలకు ముందు ఇటీవల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చినట్లే.. విశాఖలో లైట్‌ మెట్రోరైలు ప్రాజెక్టుకు ఇప్పుడు డీపీఆర్‌ని ఆమోదించి మమ అనిపిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జగన్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక విజయవాడ, విశాఖలో మెట్రోరైలు ప్రాజెక్టులను అటకెక్కించారు. విశాఖలో పీపీపీ పద్ధతిలో 42.55 కిలోమీటర్ల పొడవున లైట్‌ మెట్రోరైలు ప్రాజెక్టును 8 వేల300 కోట్లతో గత ప్రభుత్వం ప్రతిపాదించింది. తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వం విశాఖపై ఎనలేని ప్రేమ కురిపించింది. ఆ నగరాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటించింది. అదే అభిమానం మెట్రోరైలు ప్రాజెక్టుపై ఎందుకు చూపలేదన్న ప్రశ్న వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం పంపిన డీపీఆర్‌ తప్పితే.. మళ్లీ ఇప్పటివరకు ఏపీ నుంచి నివేదిక రాలేదని కేంద్రం లోక్‌సభలో పలుమార్లు ప్రకటించింది. నాలుగున్నరేళ్లలో సీఎం నాలుగుసార్లు కూడా మెట్రోరైలు ప్రాజెక్టుపై సమీక్షించిన దాఖలాల్లేవు. రాష్ట్రప్రభుత్వ వాటా సమకూర్చాల్సి ఉంటుందని ఇన్నాళ్లూ పక్కన పెట్టి, ఎన్నికలకు ముందు బయటకు తీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రతిపాదిత లైట్‌ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణ పనుల పూర్తికి ఎనిమిదేళ్లు పడుతుంది. దశలవారీగా ప్రాజెక్టు పూర్తిచేయాలని ప్రతిపాదించారు. తొలిదశ పనులు పూర్తిచేసి మెట్రోరైలు పట్టాలెక్కాలన్నా కనీసం మూడేళ్లు అవసరం. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల పట్టించుకోని జగన్‌ తీరిగ్గా ఇప్పుడు డీపీఆర్‌ ఆమోదం తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story