అమ్మవారి చెట్టు పట్ల అవమానకరంగా ప్రవర్తించి..వెళ్లేటప్పుడు ఏం చేశారంటే?

గుళ్లు, విగ్రహాలపైనే కాదు అమ్మవారిగా కొలిచే చెట్లపై కూడా అరాచకాలు పెరిగిపోయాయి. నెల్లూరు నగరంలోని అమ్మవారి చెట్టు పట్ల కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అవమానకరంగా ప్రవర్తించడం కలకలం రేపింది. విరాట్‌నగర్‌లోని ప్రభుత్వ స్థలంలో ఉన్న వేప చెట్టును చాలాకాలంగా స్థానికులు అమ్మవారిగా పూజిస్తున్నారు. కానీ దైవంగా కొలిచే ఆ చెట్టుపై కొంతమంది దుష్టశక్తుల కన్ను పడింది. రాత్రికి రాత్రే ఆ చెట్టు చుట్టూ ముళ్ల కంచె వేసి భక్తులను భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇదంతా ఆకతాయిల పనిగా భావించిన స్థానికులు.. ముళ్ల కంపను తొలించి పూజలు చేశారు.
ఇక మరుసటిరోజు మరింత రెచ్చిపోయిన ఆగంతకులు... తెల్లవారుజామున నాలుగు గంటలకు చెట్టుకు ఉన్న చీర, పుష్పాలను అత్యంత దారుణంగా తొలగించి పడేశారు. దీపం విసిరేశారు. నానా రచ్చ చేశారు. లుంగీలు కట్టుకుని, గొడుగులు పట్టుకుని వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఇదంతా చేస్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. అయితే చేసిందంతా చేసి వెళ్లేటప్పుడు మాత్రం కర్పూరం వెలిగించి చెంపలు వేసుకుని వెళ్లారు. పాపం తగులుతుందనే భయంతోనే ఇలా చేసి ఉంటారని స్థానికులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com