అవినాష్ బెయిల్ రద్దుపై సునీత ఫైట్.. విచారణ 19కి వాయిదా

అవినాష్ బెయిల్ రద్దుపై సునీత ఫైట్.. విచారణ 19కి వాయిదా
సీనియ‌ర్ల లాయ‌ర్ల వాద‌న‌ల‌ను విన‌బోమ‌ని కోర్టు చెప్ప‌డం వ‌ల్ల త‌న కేసును తానే వాదించుకున్నారు సునీత.

వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముంద‌స్తు బెయిల్ ర‌ద్దుపై సుప్రీంకోర్టులో విచార‌ణ‌ జరిగింది. ముందస్తు బెయిల్ ను వివేకా కుమార్తె సునీతారెడ్డి సవాల్ చేసింది. ఇందుకుగాను విచారణ జరిగింది. సీనియ‌ర్ల లాయ‌ర్ల వాద‌న‌ల‌ను విన‌బోమ‌ని కోర్టు చెప్ప‌డం వ‌ల్ల త‌న కేసును తానే వాదించుకున్నారు. సీనియ‌ర్ లాయ‌ర్ల వాద‌న‌లు విన‌నందున సీబీఐకి నోటీసులు జారీచేసే విష‌యాన్ని ధ‌ర్మాస‌నం ప‌ట్టించుకోలేదు. కాగా.. అద‌న‌పు డాక్యుమెంట్లు దాఖ‌లు చేయ‌డానికి సునీతారెడ్డికి సుప్రీం అవ‌కాశం ఇచ్చింది. న్యాయ‌మూర్తులుగా జ‌స్జిస్ విక్ర‌మ్‌నాధ్‌, జ‌స్జిస్ అస‌నుద్దీన్ అమానుల్లా ఉన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు త‌దుప‌రి విచార‌ణ 19 కి వాయిదా వేసింది.


తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చే సమయంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకోలేదని సునీత గౌరవ కోర్టుకు తెలిపింది. సీబీఐ సేకరించిన సాక్షాలను పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. అత్యున్నత న్యాయస్థానం చెప్పిన అంశాలకు విరుద్ధంగా అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు అయిందని తెలిపారు. సీబీఐ దర్యాప్తుకు అవినాష్ రెడ్డి ఏమాత్రం సహకరించడం లేదని.. చివరిగా మూడుసార్లు ఇచ్చిన నోటీసులకు కూడా ఆయన సీబీఐ ముందు హాజరు కాలేదని చెప్పారు.


అరెస్టు నుంచి తప్పించుకునేందుకే తల్లి అనారోగ్యంతో ఉందన్న కారణాలను చూపించి హాస్పిటల్ లో అవినాష్ రెడ్డి షెల్టర్ తీసుకున్నారని కోర్టుకు తెలిపారు సునీత. సీబీఐ అరెస్టు చేయకుండా అతని మద్దతుదారులు, గూండాలు అధికారులకు అడ్డుపడ్డారని చెప్పారు. స్థానిక పోలీసుల సమక్షంలోనే ఘటన స్థలంలోని ఆధారాలను అవినాష్ చెరిపేశారని సునీత ఆరోపించారు. ఆధారాలు చెరిపేయ‌డమే కాకుండా గుండెపోటుతో చనిపోయినట్లుగా కథను అల్లి ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


సిట్టింగ్ ఎంపీ అయిన అవినాష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సాక్షులను ప్రభావితం చేయడమే కాకుండా బెదిరిస్తున్నారని అన్నారు సునీత. కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు వ్యతిరేకంగా తప్పుడు ఫిర్యాదులు చేయడమే కాకుండా కేసులను కూడా నమోదు చేయించినట్లు తెలిపారు. అభియోగాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారని అన్నారు. మొత్తం పరిణామాల నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోర్టును కోరుతున్నట్లు సునీత తెలిపింది.

ఈనెల 30వ తేదీ నాటికి దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్న గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ నుకూడా న్యాయస్థానం రద్దు చేసింది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయి. అంతేకాక దర్యాప్తు కొనసాగింపు కూడా అడ్డుగా నిలిచే అవకాశం ఉంది. గతంలో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మద్యంతర పిటిషన్ కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు మినీ ట్రయల్ని నిర్వహించడమే కాకుండా అవినాష్ రెడ్డి సహా ఇతర నిందితులు చేసిన వాదనాలనే పరిగణంలోకి తీసుకున్నట్లు కనబడుతోంది. సిబిఐ దర్యాప్తును విచారణను ఏపీ నుంచి బదిలీ చేయడమే కాకుండా వివేక హత్య వెనక ఉన్న విస్తృత కుట్ర కోణాన్ని తేల్చాలని సీబీఐని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story