VIVEKA WIFE: జగన్‌... నీకు ఇది ధర్మమా..?

VIVEKA WIFE: జగన్‌... నీకు ఇది ధర్మమా..?
సీఎం జగన్‌కు వివేకా సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ... సొంత చెల్లెళ్లపై సాక్షి మీడియాలో వ్యతిరేక వార్తలు రావడం బాధగా ఉందని ఆవేదన

సీఎం జగన్‌కు వివేకా సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వడం ధర్మమా అని ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు మద్దతు ఇవ్వకపోగా... ఆమెపైనా, షర్మిలపైనా నిందలు వేయడం ఎంతవరకు సబబని నిలదీశారు. సొంత చెల్లెళ్లపై సాక్షి మీడియాలో వ్యతిరేక వార్తలు రావడం బాధగా ఉందని సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

పులివెందుల బహిరంగ సభలో వివేకా హత్యపై జగన్ మాట్లాడుతుండగానే... వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ విడుదల చేశారు. 2009లో తండ్రిని కోల్పోయినప్పుడు జగన్‌ ఎంత మనోవేదన అనుభవించారో 2019లో సునీత కూడా అంతే బాధ అనుభవించిందన్నారు. నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలు తమను మరింత ఎక్కువగా బాధ పెట్టాయని సౌభాగ్యమ్మ లేఖలో ప్రస్తావించారు. కుటుబంలోని వారే హత్యకు కారణం కావడం... వాళ్లకు సీఎం రక్షణగా ఉండటం తగునా అని జగన్‌ను ప్రశ్నించారు. జగన్‌ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నను ఈ విధంగా... సాక్షి పత్రిక, టీవీ ఛానల్‌, సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననం చేయించడం ఎంతవరకు సబబని సౌభాగ్యమ్మ ప్రశ్నించారు.

న్యాయం కోసం పోరాడుతున్న చెల్లెళ్లను హేళన చేస్తూ... నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే... నీకు పట్టడం లేదా?.... అని జగన్‌ను లేఖలో ప్రశ్నించారు. సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే... జగన్‌ నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం సమర్థనీయం కాదన్నారు. హత్యకు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం కల్పించడం సమంజసమా? అని నిలదీశారు. ఇలాంటి దుశ్చర్యలు మంచిదికాదని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా... నిజం వైపు నిలబడమని వేడుకుంటున్నానని... సౌభాగ్యమ్మ ఆవేదనతో కూడిన లేఖను జగన్‌కు రాశారు.

Tags

Read MoreRead Less
Next Story