YCP: ప్రజా సొమ్ముతో వైసీపీ ప్రచారం

YCP: ప్రజా సొమ్ముతో వైసీపీ ప్రచారం
మండిపడుతున్న ప్రజలు... వాలంటీర్లు, అధికారులు కూడా భాగస్వాములే

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, అధికార పార్టీ కలిసి గురువారం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే పేరుతో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అయితే ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులను భాగస్వామ్యులను చేయడం వివాదం రేపుతోంది. పార్టీ కార్యక్రమానికి అధికారులను వినియోగించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా దీన్ని ఎంత పక్కాగా నిర్వహించాలో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు సీఎం జగనే స్వయంగా ఆదేశాలు జారీచేశారు. ఆ కార్యక్రమంలో అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రభుత్వ అధికారుల్ని, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్ని, వాలంటీర్లను ప్రభుత్వం అధికారికంగానే భాగస్వాముల్ని చేస్తోంది. మరీ ఇంతలా ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఉన్న విభజన రేఖను దాటిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు.


ఒకరకంగా చెప్పాలంటే ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ఎన్నికల ప్రచారం చేపట్టింది. దీన్ని సమర్థించుకోవడానికి పార్టీ నేతలు తెగ తంటాలు పడుతున్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక పార్టీకి, ప్రభుత్వానికి తేడా లేకుండా చేశారంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. అదేంటంటే ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం, వాలంటీర్లను పార్టీ వేగులుగా వాడుకోవడం ,ప్రభుత్వఖర్చుతో నిర్వహించే సభల్లో సీఎం జగన్ విపక్షాలపై విరుచుకుపడటమే. ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ నాయకులు వారి ప్రభుత్వం గురించి ఎన్ని గొప్పలైనా చెప్పుకోవచ్చు కానీ మళ్లీ జగనే కావాలంటూ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు చెప్పడమేంటో అర్థంకావడం లేదు. పైగా ఈ కార్యక్రమానికి గ్రామాల్లో పంచాయతీరాజ్‌శాఖ విస్తరణాధికారిని, పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ను ప్రభుత్వం నోడల్‌ అధికారులుగా నియమించింది.


వాలంటీర్లు, వైసీపీ నాయకులు కలిసే ఇంటింటికీ వెళ్లి జగన్‌ ప్రభుత్వ పాలనపై గొప్పలు చెబుతూ సర్కారు సొమ్ముతో రూపొందించిన బ్రోచర్‌ని, జగన్‌ హామీల అమలుపై సిద్ధంచేసిన మరో బ్రోచర్‌ని పార్టీ నాయకులు ప్రజలకు అందజేశారు. సచివాలయాల్లో డిస్‌ప్లే బోర్డులు, బహిరంగ సభల నిర్వహణకు దాదాపు 150 కోట్ల ప్రభుత్వ ధనం ఖర్చుపెట్టనున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉందంటూ న్యాయస్థానాలు ఎన్ని మొట్టికాయలు వేసినా సీఎం జగన్‌కు పట్టడం లేదు. గ్రామ, వార్డు వాలంటీర్లకు శిక్షణనిచ్చేందుకు ఎఫ్‌ఓఏని ఏర్పాటు చేస్తున్నామన్న పేరుతో ఏటా రూ.68 కోట్ల ప్రజాధనాన్ని దోచిపెడుతూ మండలానికో ఏజెంట్‌ని పెట్టుకుని పార్టీ పని చేయించుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కార్యక్రమాలు చేపట్టినలు కోకొల్లలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story